అమిత్ షా బ్యాగుల తనిఖీ
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:41 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, నవంబరు 15: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హింగోలి జిల్లాలో మహాయుతి కూటమి పార్టీల తరఫున ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బ్యాగులను, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అమిత్ షా తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘‘హింగోలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. ఈ సందర్భంగా నేను ప్రయాణించిన హెలికాప్టర్ సహా నా బ్యాగేజీని ఈసీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై బీజేపీకి విశ్వాసం ఉంది’’ అని షా పేర్కొన్నారు. ఇదిలావుంటే, గత మూడు రోజులుగా ఈసీ తమ బ్యాగులను మాత్రమే తనిఖీ చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని పార్టీల నాయకులకు చెందిన బ్యాగులు, వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తుండడం గమనార్హం.