Biden Govt : ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ కాంట్రాక్టర్లు!
ABN , Publish Date - Jun 27 , 2024 | 04:12 AM
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేసే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రష్యా భూభాగంలో తమ ఆయుధాలతో దాడి చేసేందుకు మే నెలలో ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన అమెరికా..
కీలక నిర్ణయం దిశగా బైడెన్ ప్రభుత్వం
వాషింగ్టన్, జూన్ 26: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేసే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రష్యా భూభాగంలో తమ ఆయుధాలతో దాడి చేసేందుకు మే నెలలో ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన అమెరికా.. ఇప్పుడు తమ దేశానికి చెందిన ఆయుధాల కాంట్రాక్టర్లను ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడంపై విధించుకున్న అప్రకటిత నిషేధం ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. నిజానికి, రష్యా-ఉక్రెయిన్ పోరుకు అమెరికా దళాలు, ప్రజలను దూరంగా ఉంచేందుకు జోబైడెన్ దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొందనే భావన రష్యాకు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాల మరమ్మతులు, నిర్వహణ పనులను అమెరికా స్వయంగా చేపట్టడం లేదు. ఆయా ఆయుధాలను నిర్వహణ పనుల కోసం పోలాండ్, రొమేనియా లేదా ఏదైనా నాటో సభ్య దేశానికి తరలిస్తున్నారు. ఈ విధానం వల్ల చాలా సమయం వృథా అవుతోంది. దీంతో యుద్ధభూమిలో రష్యా పైచేయి సాధిస్తుంది.
ఈ నేపథ్యంలో అప్రకటిత నిషేధం ఎత్తివేత ప్రతిపాదనపై అమెరికా అధికార వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి ఈ ఏడాదే బైడెన్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికాకు చెందిన ఆయుధాల కాంట్రాక్టర్లు స్వయంగా ఉక్రెయిన్ వెళ్లి పని చేయనున్నారు. ఫలితంగా ఆయుధాల మరమ్మతు, నిర్వహణ పనులు వేగవంతం కానున్నాయి. పైగా, అమెరికా త్వరలో ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్లు ఇవ్వనుంది. ఈ నిషేధం ఎత్తివేత ఎఫ్-16ల నిర్వహణకు కూడా ఉపకరిస్తుందని అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి.