Rahul Gandhi: కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫొగాట్?
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:38 AM
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. బుధవారం ఆమె రాహుల్ గాంధీతో సమావేశమవడం చర్చనీయాంశమైంది. వినేశ్‌తో పాటు బజరంగ్ పునియా కూడా రాహుల్‌ను కలిశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో వినేశ్, పునియా పోటీ ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జులానా స్థానం నుంచి వినేశ్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక పునియాను బద్లి స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతే ఏఐసీసీలో కీలక పదవిని ఇస్తారన్న ప్రచారంకూడా జరుగుతోంది. వీరిద్దరి చేరికతో హరియాణాలో జాట్‌ల ఓట్లు కాంగ్రె్‌సకు అనుకూలంగా మరింత సంఘటితమవుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫొగాట్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా, ప్రచారం చేసినా పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, మహిళలు నీరాజనాలు పడతారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్న వేళ వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరితే పార్టీకి మరింత బలం చేకూరినట్లవుతుంది.
హరియాణా అసెంబ్లీలో 90 సీట్లుండగా.. ఆప్ తమకు 10 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఏడు సీట్ల కంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పినట్లు సమాచారం. మరోవైపు వినేశ్ సోదరి బబిత 2019లో బీజేపీ తరఫున దాద్రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానంలో బబితకు పోటీగా వినేశ్‌ను దించాలని కాంగ్రెస్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 67మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. దాని ప్రకారం.. లద్వా నుంచి సీఎం నాయబ్ సైనీ పోటీ చేయనున్నారు.