Haryana Assembly Elections: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వినేశ్, బజరంగ్ పునియా
ABN , Publish Date - Sep 06 , 2024 | 01:42 PM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06: హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వారిద్దరు పార్టీలో చేరనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన న్యూఢిల్లీలో వీరిద్దరు రాహుల్ గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
అనంతరం వినేశ్, బజరంగ్‌లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారంటూ ఓ ప్రచారం అయితే హరియాణాలో ఊపందుకుంది. ఇక జూనియర్ రెజ్లెర్లను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లర్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భరత్ భూషణ్ సింగ్ వ్యతిరేకంగా వినేశ్ ఫొగెట్, బజరంగ్ పూనియా బలంగా పోరాడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వినేశ్ ఫొగెట్, బజరంగ్ పునియాలు రాహుల్ గాంధీతో సమావేశం కావడంపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఈ సందర్భంగా వినేశ్, బజరంగ్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విధితమే.
రాష్ట్రంలో అధికార బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులోభాగంగా జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలోకి రావడం వల్ల.. తమకు ఆ సామాజిక వర్గం ఓటింగ్ శాతం పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది.
అదీకాక వినేశ్ ఫొగెట్‌కు రాజ్యసభ సీటు కేటాయించాలని హరియాణా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా ఇటీవల నిర్ణయించారు. కానీ వయస్సు అడ్డంకి కారణంగా ఆమె రాజ్యసభకు ఎంపిక కాలేదు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావాలంటే.. కనీసం 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
కానీ వినేశ్ పొగెట్ వయస్సు అంతకంటే తక్కువ కావడంతో.. ఆమె పెద్దల సభలో అడుగు పెట్టలేక పోయారు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొన్నారు. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. అనంతరం క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు వినేశ్ ఫొగాట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలు ఆక్టోబర్ 8వ తేదీన వెల్లడికానున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు సీట్ల పంపకంపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అవి నేడో రేపో ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారం.
Read More National News and Latest Telugu News Click Here