వీసా లేకుండానే రష్యాకు!
ABN , Publish Date - Oct 29 , 2024 | 02:40 AM
భారతీయులు వీసా లేకుండానే రష్యాలో పర్యటించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మేరకు వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్(మార్చి) నుంచి ప్రయాణ నిబంధనలను సరళతరం చేసేందుకు భారత్...
భారతీయులకు శుభవార్త
వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్ నుంచి అమలు?
న్యూఢిల్లీ, అక్టోబరు 28: భారతీయులు వీసా లేకుండానే రష్యాలో పర్యటించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మేరకు వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్(మార్చి) నుంచి ప్రయాణ నిబంధనలను సరళతరం చేసేందుకు భారత్, రష్యా ప్రణాళికలు రూపొందించాయని సోమవారం ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. వీసా నిబంధనలపై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు ఈ ఏడాది జూన్‌లోనే ఇరుదేశాలూ చర్చలు జరిపినట్టు తెలిపింది. భారత్ నుంచి రష్యాకు పర్యాటకుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది. ‘ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి రష్యా రాజధానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది’ అని మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ ఎవ్‌గనీ కోజ్లోవ్ చెప్పినట్టు తెలిపింది. గతేడాది 60 వేల మందికిపైగా భారత్ నుంచి రష్యా రాజధానికి వచ్చారని ఎవ్‌గనీ కోజ్లోవ్ చెప్పారు. ప్రస్తుతం చైనా, ఇరాన్ నుంచి రష్యా పర్యటనకు వెళ్లే వారికి మాత్రమే వీసా రహిత ప్రయాణం అందుబాటులో ఉంది. కాగా, నాలుగు రోజుల్లోనే జారీ అయ్యే ఈ-వీసా రష్యాలో పర్యటించే భారతీయులకు గతేడాది ఆగస్టు నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ ఏడాది చివరి ఐదు నెలల్లోనే భారతీయులకు 9,500 ఈ-వీసాలను రష్యా జారీ చేసింది. రష్యా జారీ చేసిన మొత్తం ఈ-వీసాల్లో ఇది 6%. తద్వారా గతేడాది అత్యధిక ఈ-వీసాలు జారీ అయిన తొలి 5దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో 1,700 మంది భారతీయులకు ఈ-వీసాలను రష్యా జారీ చేసింది.