Share News

Amith Shah: కేరళకు ముందే చెప్పాం.. వయనాడ్ విలయంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:06 PM

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 185కి చేరగా, ఇంకా 225 మంది ఆచూకీ లభించలేదు. అయితే కేరళ(Kerala Landslides) విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు.

Amith Shah: కేరళకు ముందే చెప్పాం.. వయనాడ్ విలయంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 185కి చేరగా, ఇంకా 225 మంది ఆచూకీ లభించలేదు. అయితే కేరళ(Kerala Landslides) విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. జులై 23నే వయనాడ్ ప్రకృతి వైపరీత్యంపై సీఎం పినరయ్ విజయన్‌కి కేంద్ర బలగాలు హెచ్చరించాయని వెల్లడించారు. అయితే కేరళ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదని, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బెటాలియన్‌ల రాకతో కూడా అప్రమత్తం కాలేదని విమర్శించారు.


ఈ విషాద ఘటన తరుణంలో మోదీ ప్రభుత్వం కేరళ సర్కార్‌తోపాటు రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ఏడు రోజుల ముందే జులై 30న రాష్ట్రానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని, జులై 24న మరో హెచ్చరిక పంపినట్లు షా తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. అప్పటికే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపినట్లు వివరించారు. అయితే కేంద్రం ముందస్తు హెచ్చరికలతో ఒడిశా, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గేదని తెలిపారు. అయితే ఇప్పటివరకు 185 మృతదేహాలను వెలికితీసినట్టు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.


శవాలదిబ్బగా ఊరు..

కేరళవ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌ ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో వరద బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ముండక్కై గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. ఆ గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా.. ఆ ఇళ్లలో నివసిస్తున్న వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.


సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసులు, భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా.. సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంలో ఆటంకాలేర్పడ్డాయి. ఎలాగోలా కష్టపడి ఇప్పటివరకు 185 మృతదేహాలను బయటకి తీయగా.. ఇంకా పదుల సంఖ్యలో మృతదేహాలు మట్టి దిబ్బల్లో కూరుకుపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో గ్రామస్థులు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించడంలో అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Jul 31 , 2024 | 05:08 PM