Share News

INDIA Bloc: ఇండి కూటమిలో 'ఆప్'‌ కొనసాగుతుందా.. కాంగ్రెస్ క్లారిటీ

ABN , Publish Date - Sep 15 , 2024 | 07:38 PM

ఇండియా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌లు హోరాహోరీ తలపడతాయా? ఆప్‌తో పొత్తు ఇకముందూ కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు.

INDIA Bloc: ఇండి కూటమిలో 'ఆప్'‌ కొనసాగుతుందా.. కాంగ్రెస్ క్లారిటీ

ఢిల్లీ: ప్రజా కోర్టులోనూ తన నిజాయతీని నిరూపించుకునేందుకు సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగనుందనే అంచనాలు ఉన్నాయి. మరి ఇండియా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌లు హోరాహోరీ తలపడతాయా? ఆప్‌తో పొత్తు ఇకముందూ కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు.

కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనను హరియాణా, ఢిల్లీలోని అన్ని రాజకీయపక్షాలు ఖండించాయి. దీన్నో డ్రామాగా అభివర్ణించాయి. విమర్శలు గుప్పించిన వాటిలో కాంగ్రెస్ కూడా ఉండటం గమనార్హం. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కేంద్ర స్థాయిలోనే ఉంటుందని కాంగ్రెస్ స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఎవరి దారి వారిదే అన్నట్లు పోరాడతామని చెబుతున్నారు. ఢిల్లీకి మూడుసార్లు సీఎంగా పని చేసిన షీలా దీక్షిత్ కుమారుడ్ సందీప్ దీక్షిత్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.


"కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు? ఆయనకు తన పార్టీ నేతలపై అనుమానాలున్నాయి. అభద్రతభావంతోనే ఇలా చేశారు. బెయిల్ మంజూరైన రెండు రోజుల తర్వాత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ పని ముందే ఎందుకు చేయలేదు. సుప్రీం కోర్టు నిబంధనల వల్లే కేజ్రీవాల్ ఇలా చేశారు. ఆప్‌ నేతల్లో ఒకరంటే ఒకరికి నమ్మకం లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. కేజ్రీవాల్ రాజీనామా చేశాక, సీఎం కుర్చిలో ఎవరున్నా వారిని కంట్రోల్ చేస్తారు. కేజ్రీ పాలన వల్ల ఢిల్లీ చాలా నష్టపోయింది. హరియాణాలో కూటమి వద్దనే కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉందో అక్కడ ఆప్ పోటీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేసే దమ్ము ఆప్‌నకు లేదు. హరియాణాలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే. గుజరాత్, గోవాలోనూ కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడా ఆప్ బరిలో నిలిచింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీజేపీ లాభపడుతోంది" అని దీక్షిత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ ఛౌదరి కూడా కేజ్రీవాల్ తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే ఆప్ ఇండియా కూటమిలోనే కొనసాగుతుందని రెండు పార్టీలు కేంద్ర స్థాయిలోనే కలిసికట్టుగా పని చేస్తాయన్నారు.

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 07:38 PM