Delhi: ‘చీల్చడం’ చేటు చేస్తుందా?
ABN , Publish Date - May 01 , 2024 | 05:24 AM
ఎన్‌డీఏ కూటమికి అధికారం దక్కడంలో కీలకమైన యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది?
బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టిన అప్రదిష్ఠ!
బిహార్, మహారాష్ట్రల్లోని కూటముల్లో జోక్యం
ఈ రెండు చోట్ల ప్రత్యర్థుల పట్ల సానుభూతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఎన్‌డీఏ కూటమికి అధికారం దక్కడంలో కీలకమైన యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? మహారాష్ట్ర, బిహార్‌లోని విపక్ష కూటముల్లో వేలు పెట్టి, ప్రభుత్వాలను మార్చేసిన అప్రదిష్ఠ చేటు చేస్తుందా? ప్రత్యర్థులపై సానుభూతి పెరిగి కమలానికి ఎదురుదెబ్బ తగలనుందా? యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను మరోసారి నిలువరించగలదా? ఇవీ ప్రస్తుత ఎన్నికల సమరంలో ఆసక్తికర ప్రశ్నలు. హిందూత్వవాదం బలంగా ఉండే యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో మొత్తం 168 సీట్లున్నాయి.
2014 ఎన్నికల్లో ఎన్‌డీఏకి యూపీలో 73, మహారాష్ట్రలో 41, బిహార్‌లో 33 (మొత్తం 147) సీట్లు దక్కాయి. అంటే 87.5 శాతం స్థానాలు నెగ్గింది. ఇక 2019లో సైతం యూపీలో 64, మహారాష్ట్రలో 41, బిహార్‌లో 39 (మొత్తం 144) సీట్లు వచ్చాయి. 85.7 శాతం సీట్లు గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం ఎన్‌డీఏకు వాతావరణం ఏకపక్షంగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిహార్‌లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న నీతీశ్ కుమార్‌ను తమవైపు తిప్పుకోవడం, మహారాష్ట్రలో ఉద్ధవ్ సారథ్యంలోని కాంగ్రె్‌స-శివసేన- ఎన్సీపీ సర్కారును ఏక్‌నాథ్ శింథే ద్వారా కూల్చేయడం, ఆపై అజిత్ పవార్‌నూ ఆకర్షించి ఎన్సీపీని చీల్చడం బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచిందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో ఎన్‌డీఏ 48 సీట్లకు గాను 41 చొప్పున సాధించిన మహారాష్ట్రలో ఈసారి సీట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎన్‌సీపీ, శివసేనలను చీల్చడంలో బీజేపీ పాత్ర ఉందన్న ప్రచారంతో శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే పట్ల ప్రజల్లో సానూభూతి ఏర్పడిందని, ఆది ఓట్ల రూపంలో మారుతుందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చీలిక వర్గాల్లోకి వెళ్లిపోయినా కార్యకర్తలు మాత్రం శరద్ పవార్, ఉద్ధవ్ వైపే ఉన్నారని, ఎన్‌సీపీ (శరద్‌పవార్), శివసేన (ఉద్ధవ్), కాంగ్రె్‌సతో కూడిన మహా వికాస్ అఘాడీతో గట్టిపోటీ ఖాయమని చెబుతున్నారు.
బిహార్‌లో తేజస్వీ ప్రతాపం..
బిహార్‌లో ప్రాంతీయంగా ప్రధాని మోదీని సవాలు చేయగల స్థాయికి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మరింత బలమైన నేతగా ఎదిగారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మైనారిటీ, యాదవులు, దళితుల దన్నుతో ఆర్జేడీ-కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. నీతీశ్ తరచూ కూటములను మార్చడం బిహార్ ప్రజలకు ఏవగింపు కలిగించిందని, అలాంటి నాయకుడితో జట్టు కట్టడం బీజేపీకీ ఇబ్బందిగా మారనుందని పేర్కొంటున్నారు.
ఇక, కేంద్రంలో అధికార పీఠానికి దగ్గరి దారి యూపీ. 80 స్థానాలకు గాను 2014, 2019లో ఎన్‌డీఏ 73, 64 సీట్ల చొప్పున సాధించింది. ఈసారి అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ ఇండియా కూటమిలో భాగమై కాంగ్రె్‌సకు గౌరవ సంఖ్యలో సీట్లిచ్చింది. పంటల మద్దతు ధర కోసం ఉద్యమం, 111 మంది ఎమ్మెల్యేలు, మైనారిటీలు, యాదవ వర్గాలలో గట్టి పట్టున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఎన్‌డీఏ సీట్లను గణనీయంగా తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, అయోధ్య రామ మందిరంతో పాటు మోదీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే తమకు సీట్ల్లు సాధించిపెడుతుందని బీజేపీ నమ్ముతోంది. రైతు నేత చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడంతో లాభిస్తుందని భావిస్తోంది.