Maratha Quota: ముంబైలో అడుగుపెట్టామో మళ్లీ వెనక్కి వెళ్లం.. మనోజ్ జారంగే వార్నింగ్
ABN , Publish Date - Jan 26 , 2024 | 07:30 PM
మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల అంశం మళ్లీ వేడెక్కుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక తీర్మానం చేయాలని మఠాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శుక్రవారంనాడిక్కడ డిమాండ్ చేశారు. రాత్రిలోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే శనివారం ఉదయం ముంబై వైపు కదులుతామని హెచ్చరించారు.
నవీ ముంబై: మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల (Maratha community reservation) అంశం మళ్లీ వేడెక్కుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక తీర్మానం చేయాలని మఠాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ (Manoj Jarange Patil) శుక్రవారంనాడిక్కడ డిమాండ్ చేశారు. రాత్రిలోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే శనివారం ఉదయం ముంబై వైపు కదులుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ ఆందోళన సమయంలో నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలన్నారు.
''రాత్రి వరకూ వేచిచూస్తాం. అప్పటికి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ చేసి మాకు ఇవ్వాలి. ఇది చాలా కీలకం. శనివారం మధ్యాహ్నం 11 గంటల వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ముంబైకి బయలుదేరుతాం. ఒకసారి ముంబైకి వెళ్లడమంటూ జరిగితే ఇక వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు'' అని జారంగే చెప్పారు. దీనికి ముందు గురువారంనాడు కూడా జారంగే తమ ర్యాలీ ప్రశాంతంగా ముంబైకి వెళ్తుందని చెప్పారు. అయితే రిజర్వేషన్లు సాధించకుండా మాత్రం ముంబై విడిచిపెట్టేది లేదని చెప్పారు. ముంబై ప్రజలు కూడా తమతోటే ఉన్నారని తెలిపారు. కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు 2021 మే 5న తోసిపుచ్చింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించి మరాఠా రిజర్వేషన్ కల్పనకు ఎలాంటి సహేతుకత కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.