Share News

National Politics: దీదీ కొత్త నినాదం.. కాంగ్రెస్ నేతల అభ్యంతరం.. ఇండియా కూటమిలో చీలిక తప్పదా..

ABN , Publish Date - Dec 08 , 2024 | 09:03 AM

ఇప్పటిరవకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా.. తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా అడ్డకట్ట వేయలేకపోయినప్పటికీ.. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ..

National Politics: దీదీ కొత్త నినాదం.. కాంగ్రెస్ నేతల అభ్యంతరం.. ఇండియా కూటమిలో చీలిక తప్పదా..
Mamata Banerjee

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన మమతా బెనర్జీ.. అవసరమైతే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తానంటూ మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటిరవకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా.. తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా అడ్డకట్ట వేయలేకపోయినప్పటికీ.. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా నిలువరించగలిగారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బెంగాల్‌లో తృణమూల్, మహారాష్ట్రలో ఎన్సీపీ (శరద్ పవార్) శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీల ప్రభావంతో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు గౌరవప్రథమైన స్థాయిలో సీట్లు గెలుచుకోగలిగాయి.


ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్‌కు లభించింది. 2019తో పోలిస్తే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలకు సీట్లు పెరగడంతో భవిష్యత్తులో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇస్తుందనే విశ్వాసాన్ని ఇండియా కూటమి పక్షాలు వ్యక్తం చేశాయి. ఈలోపు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నస్థాయిలో పోటీని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఇండియా కూటమిలోని పక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా ఇండియా కూటమికి నాయకత్వంపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోనే తీవ్ర దుమారాన్ని రేపుతోంది.


ఎస్పీ సై.. కాంగ్రెస్ అభ్యంతరం

ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాల్లో బలమైన పార్టీలు ఎస్పీ, తృణమూల్, ఎన్సీపీ, శివసేన(ఉద్దవ్) పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పరిధిలో ఈ నాలుగు పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీని ఈ ప్రాంతీయ పార్టీలు బలంగా ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్‌తో పోల్చి చూసినప్పుడు ప్రాంతీయ పార్టీల స్ట్రైక్ రేటు బెటర్‌గా ఉండటంతో కూటమిలో ప్రాంతీయ పార్టీల పెత్తనం బాగా పెరిగింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిపై కొన్ని పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిని లీడ్ చేసేందుకు తాను సిద్ధమని, బెంగాల్ నుంచే కూటమిని నడిపిస్తానని చెప్పడం సంచలనంగా మారింది. దీదీ వ్యాఖ్యలకు ఎస్పీతో పాటు శివసేన(ఉద్ధవ్) పార్టీ నాయకులు మద్దతు తెలపడం, మరోవైపు కాంగ్రెస్ అభ్యంతరం తెలపడంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తృణమూల్ అధినేత వైఖరిపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ దీదీ నాయకత్వాన్ని అంగీకరించకపోతే కూటమిలో చీలిక వస్తుందా అనేది తెలియాలంటూ కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 08 , 2024 | 09:03 AM