Modi on Mahatma: 1982లో సినిమా తర్వాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ... కస్సుమన్న కాంగ్రెస్
ABN , Publish Date - May 29 , 2024 | 06:50 PM
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం 'గాంధీ'పై సినిమా వచ్చేంత వరకూ జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ కస్సుమంది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోదీ ధ్వసం చేశారని ప్రతి విమర్శలు చేసింది.
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం 'గాంధీ'పై సినిమా వచ్చేంత వరకూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ కస్సుమంది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని (Legasy) మోదీ ధ్వసం చేశారని ప్రతి విమర్శలు చేసింది.
మోదీ ఏమన్నారు?
స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మాగాంధీ గురించి 1982లో రిచర్డ్ అటెన్‌బరో 'గాంధీ' చిత్రం వచ్చేంతవరకూ ప్రపంచానికి తెలియదని, మహాత్మాగాంధీ గొప్పతనం గురించి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమోట్ చేయలేదని 'ఏబీపీ న్యూస్' ఛానెల్‌కు మంగళవారంనాడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. గత 75 ఏళ్లుగా గాంధీజీ గ్లోబల్ రెప్యుటేషన్‌ను పదిలపరిచే బాధ్యత దేశానికి లేదా అని ప్రశ్నించారు. ''మహాత్మాగాంధీ మహనీయుడు (Great soul). ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సిన బాధ్యత గత 75 ఏళ్లుగా మనకు లేదా?. మొదటిసారిగా గాంధీ చిత్రం తీసినప్పుడు (1982) ఆయన ఎవరని ఆసక్తిగా ప్రపంచ చూసింది. మనం చేయాల్సినంత చేయలేదు. ప్రపంచానికి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి తెలిసినప్పుడు, వారికి గాంధీ ఏమాత్రం తక్కువ కాదనే విషయం అంగీకరించి తీరాలి. ప్రంపంచమంతా తిరిగి వచ్చిన తర్వాతే నేను ఈమాట చెబుతున్నాను'' అని మోదీ అన్నారు.
గాంధీజీ 'లెగసీ'ని దెబ్బతీశారు..
మోదీ ఇంటర్వూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిపై మండిపడింది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోదీనే ధ్వంసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విమర్శించారు. 1982కు ముందు గాంధీజీని ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదనే ఊహా ప్రపంచంలో మోదీ జీవిస్తున్నారని అన్నారు. ''మహాత్మాగాంధీ వారసత్వాన్ని ఎవరైనా ధ్వంసం చేశారంటే అది మోదీనే. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని గాంధీ సంస్థలను ఆయన ప్రభుత్వమే ధ్వంసం చేసింది. ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హాల్‌మార్క్. మహాత్మాగాంధీ జాతీయతాభావాన్ని వాళ్లు అర్ధం చేసుకోలేదు. వారి ఐడియాలజీ కారణంగానే నాథూరాం గాడ్సే మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకోవడానికి దారితీసింది'' అని జైరాం రమేష్ అన్నారు.
Lok Sabha Elections: నవీన్ పట్నాయక్ ఆరోగ్యానికి ఏమైంది? కుట్ర కోణం ఉందా?.. సభలో మోదీ ప్రస్తావన
గాంధీ భక్తులు, గాడ్సే భక్తులకు మధ్యే...
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు మహాత్మాగాంధీ భక్తులకు, గాడ్సే భక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ''ఔట్ గోయింగ్ ప్రధాని, ఆయన గాడ్సే సహచరుల ఓటమి నిశ్చయం'' అని ఆయన అన్నారు.