Kanchanjunga Express: సిగ్నల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే.. కాంచన్‌గంగా రైలు ప్రమాదంపై అధికారుల నివేదిక
ABN , Publish Date - Jul 17 , 2024 | 01:19 PM
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జూన్‌లో జరిగిన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జూన్‌లో జరిగిన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఘటనకు వివిధ స్థాయిల్లో లోపాలు ఉన్నాయని, దాంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ తన నివేదికలో వెల్లడించారు. ఇందువల్లే ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జున్ 19న ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు. అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్ రాజధాని కోల్‌కతాకు వెళ్తున్న కాంచనగంగా ఎక్స్‌ప్రెస్‌ను న్యూజల్పాయ్‌గురి దాటిన తర్వాత రంగసాని స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెనుకనుంచి గట్టిగా ఢీకొట్టింది. గూడ్స్ బోగీలు చెల్లాచెదురయ్యాయి. కాంచనగంగా బోగీలు రెండు పట్టాలు తప్పగా, ఓ బోగి అమాంతం గాల్లోకి లేచింది.గూడ్స్ డ్రైవర్, సహాయక డ్రైవర్, కాంచనగంగా గార్డ్ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
1,500 కి.మీ. మార్గంలోనే ‘కవచ్’
రెండు రైళ్లు ఒకే ట్రాక్ (పట్టాలు)పైకి వచ్చినపుడు ఢీకొనకుండా తీసుకొచ్చిన వ్యవస్థ ‘కవచ్’. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న భారత్‌లో ఇంకా చాలా మార్గాల్లో అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు 1,500 కి.మీ. పరిధి రైల్వే మార్గంలోనే కవచ్ వినియోగం ఉంది. ఇది 1.30 లక్షల రూట్ కిలోమీటర్లు ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఒక శాతమే. అందులోనూ మొత్తం కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే ఉండడం గమనార్హం.
ఇందులో తెలంగాణ (684 కి.మీ.)దే అత్యధిక వాటా. ఏపీలో 66, కర్ణాటకలో 117, మహారాష్ట్రలో 598 కి.మీ. నెట్ వర్క్ కవచ్ పరిధిలోకి వచ్చింది. కాగా, ఒక రైలు వెళ్తున్న ట్రాక్‌పైనే మరో రైలు కూడా వస్తున్నట్లయితే ‘కవచ్’ వెంటనే సెన్సార్లతో గుర్తిస్తుంది. రైలు దానంతటదే ఆగిపోతుంది. పైలట్ రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్తున్నా, బ్రేకులు పడిపోతాయి. రాణిపత్ర-ఛత్తర్‌హట్ కూడలి మధ్య ఆ రోజు తెల్లవారుజాము నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయలేదని రైల్వే వర్గాలు చెప్పాయి.
For Latest News and National News click here