భారత్ వాంటెడ్‌కు పాక్ వెల్‌కమ్
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:33 AM
పలు కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొంటూ, అరెస్టును తప్పించుకోవడానికి 2016లో దేశం విడిచి మలేసియా పారిపోయిన వివాదాస్పద ఇస్లామ్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ స్వాగతం పలకడం తీవ్ర కలకలం రేపుతోంది.
2016నుంచి పరారీలో జకీర్ నాయక్
హఠాత్తుగా పాకిస్థాన్‌లో జకీర్ ప్రత్యక్షం
హిందువులు, సాధువులు ఎద్దుమాంసం తింటారంటూ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబరు 3: పలు కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొంటూ, అరెస్టును తప్పించుకోవడానికి 2016లో దేశం విడిచి మలేసియా పారిపోయిన వివాదాస్పద ఇస్లామ్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ స్వాగతం పలకడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్‌పై నోరు పారేసుకునే సిక్కు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్టేగానే, ముస్లింలను రెచ్చగొట్టడానికి జకీర్ నాయక్‌ను కూడా పాకిస్థాన్ తన దేశంలోకి ఆహ్వానించిందని భారత ఉన్నత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ‘‘పలు కేసుల్లో ఈడీ, ఎన్‌ఐఏ వెతుకుతున్న నేరగాడు పాకిస్థాన్‌కు అతిథి అయ్యా డు.
నెల రోజుల ఆయన పర్యటన కోసం ప్రభుత్వ భద్రతను కల్పించారు. పరారీలో ఉన్న వ్యక్తిని పాక్ ప్రధాని స్వయంగా కలుస్తుండటం ఇంకా ఆశ్చర్యంగొలిపే విషయం. పాక్ గూఢచార్య సంస్థ ఐఎ్‌సఐ అనుమతితోనే ఆయన అక్కడ పర్యటనకు వెళ్లారు’’ అని ఈ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ మీడియాకు జకీర్ నాయక్ ఇస్తున్న ఇంటర్వ్యూలను, అందులో హిందువులు, సాధువులపై చిమ్ముతున్న విషాన్ని నిఘా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ‘‘భారత్‌లో హిందువులు కూడా ఎద్దు మాంసం తింటారు. ఆ విషయం వాళ్ల గ్రంథాల్లోనే రాసుకున్నారు. చివరకు హిందువులు పూజించే గురువులు, సాధువులు సైతం ఎద్దు, మేక మాంసం తింటారు’’ అని పాక్ మీడియాకు జకీర్ తెలిపారు.