Share News

Awareness : ఇలా బరువు బలాదూర్‌

ABN , Publish Date - Aug 27 , 2024 | 03:23 AM

చక్కెర ఎంత తీయగా ఉంటుందో శరీరానికి అంత చేటు చేస్తుంది. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్‌ఫ్లమేషన్‌), సోరియాసిస్‌, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.

Awareness : ఇలా బరువు బలాదూర్‌

అవేర్‌నెస్‌

అవసరానికి మించిన క్యాలరీలతో పాటు, అసవ్యస్థ హార్మోన్లు శరీర బరువును పెంచుతాయి. కాబట్టి తినే ఆహారంతో పాటు, వేధించే ఆరోగ్య సమస్యలను కూడా అదుపులో పెట్టుకోవాలి.

క్కెర ఎంత తీయగా ఉంటుందో శరీరానికి అంత చేటు చేస్తుంది. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్‌ఫ్లమేషన్‌), సోరియాసిస్‌, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.

చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ ఆకారం మారిపోయి చర్మం సాగే గుణం కోల్పోయి, బిగుసుకుంటుంది. కాబట్టి తీపి కోసం చక్కెర బదులు పళ్లు తినాలి. పళ్లు సహజసిద్ధ ప్రత్నామ్నాయాలు. తెల్లని చక్కెర, బ్రౌన్‌ షుగర్‌, సుక్రలోజ్‌, మేపుల్‌ షుగర్‌, మొలాసిస్‌, తేనెలు మానేయాలి. చక్కెరలా తీయగా తినాలనుకుంటే ‘స్టీవియా’ ఎంచుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెద్దగా పెరగనివ్వదు.

ఇవి మానేయాలి: సరళమైన పిండిపదార్థాలు అతి త్వరగా సింపుల్‌ షుగర్స్‌గా మారిపోతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోకుండా ఉండాలంటే క్లిష్టమైన పిండిపదార్థాలు తినాలి. ఇవి చక్కెరగా మారే వేగం తక్కువ.

కాబట్టి రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. చిలకడదుంపలు, గుమ్మడి, క్వినోవా లాంటి, ఇన్సులిన్‌ పెరగకుండా ఉంచే నెమ్మదైన పిండిపదార్థాలనే ఎంచుకోవాలి.


  • హార్మోన్ల అసమతౌల్యాలు

గ్లూటేన్‌, ధాన్యాలు, పాల ఉత్పత్తులు... ప్రధానమైన హార్మోన్‌ అసమతౌల్యాల కారకాలు. శరీరంలో అసమతౌల్యానికి లోనవుతున్న ప్రధానమైన హార్మోన్లు, ఆ హార్మోన్ల వ్యవహారశైలికి కారణమైన రుగ్మతలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

  • ప్రొలాక్టిన్‌: ఈ హార్మోన్‌ అసమతౌల్యానికి గురవడానికి కారణాలు... ఈటింగ్‌ డిజార్డర్లు, థైరాయిడ్‌ గ్రంథి పనితీరు తగ్గడం, కాలేయం పనితీరు అస్తవ్యస్థమవడం, పిట్యుటరీ గ్రంథిలో ‘ప్రొలాక్టినోమా’ అనే కణితి (ఫలితంగా అత్యధికంగా ప్రొలాక్టిన్‌ విడుదలవుతుంది). లక్షణాలను బట్టి వైద్యులను కలిసి చికిత్స తీసుకుని, ఈ హార్మోన్‌ స్రావాన్ని సరిచేసుకోవాలి.

  • ఎండోమెట్రియోసిస్‌: ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ తగ్గుదల కారణంగా ఎండోమెట్రియోసిస్‌ వచ్చే వీలుంది. ఇందుకోసం ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఒరవడిని తగ్గించే మందులు వాడి పరిస్థితిని అదుపు చేసుకోవచ్చు.

  • పిసిఒ, పిసిఒడి: చక్కెరకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, పీచును పెంచి, అత్యల్ప గ్లైసెమిక్‌ ఆహారం తీసుకుంటూ, అత్యధిక మాంసకృత్తులు, ఒమేగా 3 కొవ్వులు తీసుకోవాలి. దాంతో బరువు తగ్గుతారు. బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, అత్యధిక యాండ్రోజెన్స్‌ సమస్య తగ్గుతుంది. ఫలితంగా పిసిఒ, పిసిఒడి సమస్యలు అదుపులోకి వస్తాయి. ఇదంతా క్రమం తప్పకుండా రోజుకు 20 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల సాధించవచ్చు.


  • థైరాయిడ్‌ ఇబ్బందులు

పర్యావరణంలోని కాలుష్యాలు, విషాల ప్రభావం వల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరు అస్తవ్యస్థమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వాయు కాలుష్యం, సబ్బుల్లో ఉండే రసాయనాలు, ఆహారం నిల్వ కోసం ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌ థైరాయిడ్‌ గ్రంథిని దెబ్బతీస్తాయి. దాంతో భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులతో పాటు, శరీర బరువూ పెరుగుతుంది. థైరాయిడ్‌ సమస్య వంశపారంపర్యంగా సంక్రమిస్తుందనీ, జన్యుపరంగా సంక్రమిస్తుందనీ అనుకుంటే అది అపోహ మాత్రమే! కొత్త కార్లు, కొత్త ఫర్నిచర్‌ తగలబడకుండా అడ్డుపడటానికి వాటి తయారీలో వాడే రసాయనాలు, ఆహారం నిల్వ కోసం వాడే ప్రిజర్వేటివ్స్‌ థైరాయిడ్‌ గ్రంథి మీద ప్రభావం చూపిస్తాయి.

మానసిక ఒత్తిడి కారణంగా థైరాయిడ్‌ పనితీరు దెబ్బతింటే నిస్సత్తువ, కుంగుబాటు ఆవరిస్తాయి. థైరాయిడ్‌ స్రావం తగ్గితే బద్ధకం, నీరసం, బరువు పెరగడం జరుగుతుంది. స్రావం పెరిగితే పొడి చర్మం, బరువు తగ్గడం, ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి.

  • న్యూట్రియెంట్‌ థెరపీ: కొన్ని ఖనిజలవణాలు థైరాయిడ్‌ గ్రంథి పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. రాగి, జింక్‌, సెలీనియం, అయొడిన్‌లను నిర్దిష్ట పరిమాణల్లో అందిస్తూ చికిత్స చేస్తే థైరాయిడ్‌ సమస్య అదుపులోకి వస్తుంది. రాగి, జింక్‌ల పరిమాణాలు ఎంతో కచ్చితంగా ఉండాలి. లేదంటే హైపోథైరాయిడ్‌ తలెత్తుతుంది. అలాగే థైరాయిడ్‌ గ్రంథి సక్రమమైన పనితీరుకు విటమిన్‌ ఎ కూడా అవసరమే!


  • శుద్ధి వద్దు

ఆహారానికి శుచి, రుచి ఉండాలి. కానీ అదే శుద్ధి చేసిన ఆహారాన్ని ప్యాకెట్లలో తినడం సరికాదు. ఇలాంటి ప్రాసె్‌సడ్‌ ఫుడ్‌లో నిల్వ రసాయనాలు, కృత్రిమ రంగులు, రుచులు జోడించి ఉంటాయి.

ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ మొత్తాల్లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌, ఉప్పు, చక్కెరలూ ఉంటాయి. కాబట్టి ప్యాకెట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటిలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని మరింత సున్నితంగా మార్చేసి, పలు రకాల అలర్జీలకు తేలికగా గురయ్యేలా చేస్తాయి.

గ్లూటేన్‌ లేని ప్యాకెట్‌ ఫుడ్స్‌ కూడా విపరీతంగా శుద్ధి చేయబడి, పీచు లేని పిండి కలిగి ఉంటాయి. ఇవన్నీ విషంతో సమానం. గ్లూటేన్‌ లేని పదార్థాలు తినాలనకుంటే పాలిష్‌ పట్టని గోధుమలు, బియ్యం, శిరిఽ ధాన్యాలు, క్వినోవా తినాలి. ప్యాకెట్లలో దొరికే చిప్స్‌, కేక్స్‌ మానేయాలి.

వీటితో పాటు ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలలో దొరికే శుద్ధి చేసిన నూనెలు (పొద్దుతిరుగుడు, వేరుసెనగ) కూడా మానేయాలి. ఇవన్నీ ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ చక్కెరల్లా, హార్మోన్ల పనితీరును దెబ్బతీసి స్థూలకాయులుగా మారుస్తాయి.


  • లవణం మరణం

ఉప్పు ఆహారంలో అత్యవసరం. ఆహారానికి రుచిని అందించడంతో పాటు నాడుల మధ్య ప్రసారాలు జరగడానికి, రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉండడానికీ, హార్మోన్ల స్రావాలు క్రమం అవడానికీ ఉప్పు అవసరమే! అయితే ఆ అవసరాలకు మించి ఉప్పు తీసుకుంటూ ఉంటాం. అది అనర్థాలను తెచ్చి పెడుతోంది.

నిజానికి వైద్యులు రోజుకు 6 గ్రాముల ఉప్పునే తీసుకోమని సూచిస్తున్నారు. ఇది ఒక చెంచా కంటే తక్కువ. రోజుకు 13 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునేవారు 6.8 గ్రాముల ఉప్పు తీసుకునే వారి కంటే ఎక్కువగా గుండె సమస్యల బారిన పడే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.


  • ఆరోగ్యకరమైన ఉప్పు:

లవణాల్లో ‘హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌’ అనే లేత గులాబీ రంగు ఉప్పు మేలైనది. దీన్లో 84 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. అలాగే సముద్రపు ఉప్పులోనూ ఇన్సులిన్‌ హార్మోన్‌ను సమంగా ఉంచే శక్తి ఉంటుంది.

ఈ సముద్రపు ఉప్పు కంటే నల్ల ఉప్పు మరింత మేలు. దీన్లో ఉండే కలుషితాల కారణంగా ఈ ఉప్పుకు నల్ల రంగు వస్తుంది. కాబట్టి భయపడవలసిన పని లేదు.

Updated Date - Aug 27 , 2024 | 03:23 AM