Health Tips : ఎముకలెందుకు గుల్లబారతాయి?
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:31 AM
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
అవగాహన
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే క్యాల్షియంను ఎముకలు పీల్చుకుంటాయి. ఒకవేళ రక్తంలో క్యాల్షియమ్ స్థాయి తక్కువగా ఉంటే ఎముకల మజ్జ నుంచి క్యాల్షియం రక్తంలోకి విడుదలవుతుంది. ఎముకలకే క్యాల్షియమ్ సరిపోకపోతే రక్తం నుంచి శోషించుకుంటాయి. ఇలా ఎముకలు, రక్తం...రెండిట్లో క్యాల్షియం స్థాయులు సక్రమంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్యా ఉండదు. ఎప్పుడైతే ఈ సమతౌల్యం అదుపు తప్పుతుందో అప్పుడే ఎముకలు గుల్లబారటం, బలహీనపడటం మొదలవుతుంది. అలాగే సహజసిద్ధంగానే 30 ఏళ్ల వరకూ పెరుగుతూ వచ్చిన ఎముకల సాంద్రత అప్పటి నుంచి తగ్గటం మొదలుపెడుతుంది. దాంతో ఆస్టియోపొరోసిస్, ఎముకలు తేలికగా విరిగిపోవటం మొదలైన సమస్యలు మొదలవుతాయి.
ఇలా జరగకుండా ఉండాలంటే....
30 ఏళ్ల లోపు వరకూ సాధ్యమైనంత ఎక్కువ క్యాల్షియమ్‌ను తీసుకోవటంతోపాటు, ఆ తర్వాత దాని పరిమాణాన్ని జీవనశైలి, వయసుల ఆధారంగా పెంచుతూ ఎముకల్ని బలంగా ఉంచుకోవాలి.
ఆహారంలో క్యాల్షియం:
క్యాల్షియం తగినంత లేని ఆహారం తీసుకోవటం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. చిన్న వయసులోనే బోన్ లాస్ జరిగి ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి.
అస్తవ్యస్త ఆహార వేళలు:
సమయానికి తినకపోవటం, తగినంత తినకపోవటం వల్ల కూడా క్యాల్షియమ్‌ను తగినంతగా శరీరం శోషించుకోలేదు.
పాలకు బదులు టీ, కాఫీలు:
పాలు తాగే అలవాటు అందరిలో కొరవడుతోంది. టీ, కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అనుకుంటే పొరపాటు. కానీ టీ, కాఫీల్లో ఉండే ఫైటేట్స్ క్యాల్షియమ్‌ను శరీరం శోషించుకోనివ్వకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పాలను నేరుగా తాగాలి.
వ్యాయామం అవసరం:
వ్యాయామం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
మద్యపానం, ధూమపానం:
ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని క్యాల్షియం అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ శరీరం నుంచి బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. ఫలితంగా ఎముకలు గుల్లబారతాయి.
వయసురీత్యా:
వయసు పైబడేకొద్దీ ఎముకలు పలుచనై, బలహీనపడతాయి.
వంశపారంపర్యంగా:
తల్లితండ్రుల్లో ఆస్టియోపోరోసిస్ ఉంటే పిల్లలకు వంశ పారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది.