Share News

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

ABN , Publish Date - Aug 12 , 2024 | 05:35 AM

నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

స్ఫూర్తి

సాయం చెయ్యడానికి సంపదలు అక్కర్లేదు... స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపిస్తున్నారు ఉమారాణి.కొవిడ్‌ కాలంలో ప్రారంభించిన అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఈ చెన్నై మహిళ ‘అన్నపూర్ణి’గా మన్ననలు అందుకుంటున్నారు.

నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.

నాలుగేళ్ళ క్రితం... కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన కాలంలో... ప్రతిరోజూ కనిపించే ఈ దృశ్యాలు డి.ఉమారాణిని తీవ్రంగా కలవరపెట్టాయి.

ఒకవైపు పనులు లేక, మరోవైపు కడుపు నింపుకొనే మార్గం లేక తల్లడిల్లిపోతున్న వారికి తనవంతుగా ఏదైనా చెయ్యాలని ఆమె తల్లి మనసు తపనపడింది. ఆమె ఆలోచనల్లో ఊపిరిపోసుకున్న ‘తవమొళి అన్నదాన కూటం’ (తవమొళి అన్నదాన కేంద్రం) నాలుగున్నర సంవత్సరాల నుంచి పేదలకు కల్పతరువుగా నిలుస్తోంది.


వారే ప్రేరణ...

ఉమారాణి స్వస్థలం తమిళనాడులోని ఆరణి. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు చదువంటే ఇష్టం. కానీ చదివించే స్థోమత ఆమె కుటుంబానికి లేదు.

Untitled-6 copy.jpg

పొరుగున ఉండే ఒక వ్యక్తి ఆమె ఆసక్తిని గమనించి, సాయం చెయ్యడానికి ముందుకువచ్చారు. ‘‘ఆయన తన పింఛన్‌లో దాచుకున్న డబ్బును నాకు ఇచ్చారు. ఆయన చేసిన సాయం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చదువు పూర్తయ్యాక... నర్సింగ్‌ ట్యూటర్‌గా చేరాను. అప్పటినుంచి... అంటే దాదాపు పదహారేళ్ళుగా సమాజానికి నావంతుగా ఏదో విధమైన సాయం చేస్తూనే ఉన్నాను’’ అని చెప్పారు ఉమారాణి.

కొవిడ్‌ కారణంగా ఉపాఽధి కోల్పోయినవారికి, దిక్కులేనివారికీ అండగా నిలవాలని... చెన్నైలోని కీల్‌కట్టలై ప్రాంతంలో ఉచిత భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ‘‘అప్పట్లో నేను చెన్నై శివార్లలోని ఒక కేర్‌ సెంటర్‌లో పని చేసేదాన్ని.

నేను దాచుకున్న డబ్బు, వచ్చే జీతంతో రోజూ కనీసం అయిదారు వందలమందికి భోజనాలు పెట్టేదాన్ని. లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించేవరకూ మాత్రమే ఈ కేంద్రాన్ని నడపాలని అనుకున్నాను’’ అని చెప్పారు ఉమారాణి.

కానీ ఆ తరువాత కూడా దాన్ని కొనసాగించడానికి పేద ప్రజలే ఆమెకు ప్రేరణగా నిలిచారు. ‘‘నిరుపేద వృద్ధులు, కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసినవాళ్ళు, బిక్షగాళ్ళు, ఇళ్ళలో పనిచేసేవారు, స్వీపర్లు, రోజు కూలీలు, రిక్షా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేసేవారు, చిరుద్యోగులు... ఇలా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఎందరో భోజనానికి వస్తూ ఉంటారు.

చాలామంది మా కేంద్రం మీదే ఆధారపడుతున్నారు. హఠాత్తుగా ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అని ఆలోచించాను. నా సన్నిహితులను సంప్రదించాను. ‘‘బయట యాభై రూపాయలు పెడితేకానీ టిఫినైనా దొరకడం లేదు.

మాకు చేతనైనంత విరాళాలు ఇస్తాం. మీ సేవలను ఆపొద్దు’’ అని వాళ్ళు హామీ ఇచ్చారు. మరోవైపు ఉద్యోగం చేస్తూ... కేంద్రాన్ని కొనసాగించడం కష్టమైంది. దాంతో ఉద్యోగం మానేసి... పూర్తిగా దీనికే అంకితమయ్యాను’’ అంటారు ఉమామణి.


ఆ ఆకాంక్షతో...

రోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం... ఇలా మూడు పూటలా ఈ అన్నదాన కేంద్రం ఆహారాన్ని అందిస్తోంది. భోజనంలో అన్నం, తృణధాన్యాల కిచిడి, సాంబారు, కూర, రసం, మజ్జిగ ఉంటాయి. ‘‘ఇప్పుడు రోజూ ఎనిమిదివందల మంది వరకూ వస్తున్నారు.

పేదలతో పాటు దిగువ మధ్య తరగతివారు, చిరుద్యోగులు, విద్యార్థులు కూడా వారిలో ఉంటారు. నా కుటుంబం, బంధుమిత్రులు చేసే సాయంతో, దాతలు ఇచ్చే విరాళాలతో కేంద్రాన్ని నడుపుతున్నాను. చాలాసార్లు డబ్బు సరిపోదు. ఎవరో ఒకరి సాయంతో నెట్టుకొస్తున్నాను.

వంట పని మొత్తం నేనే చేస్తాను. పదోక్లాసు, ఆరోక్లాసు చదువుతున్న నా పిల్లలిద్దరూ సాయపడతారు. వడ్డనలు, ఇతర పనులు కొందరు స్వచ్ఛందంగా చేస్తున్నారు’’ అని చెప్పారు ఉమామణి. ఆమెను స్థానికులు ‘అన్నపూర్ణి’ (అన్నపూర్ణాదేవి) అని పిలుస్తూ ఉంటారు. ‘‘ఆమె ఎవరో నాకు తెలీదు.

నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె అన్నదాతగా, నేను ఆకలితో ఉన్న వ్యక్తిగా... మా ఇద్దరి మధ్యా బంధం ఏర్పడింది’’ అని ఒక వృద్ధురాలు చెబితే... ‘‘కొవిడ్‌ సమయంలో పనుల్లేక ఎంతో కష్టపడ్డాం. అప్పుడే ఉమారాణి ఉచిత భోజనం గురించి తెలిసింది. నాటినుంచి క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తున్నాను’’ అంటారు మరో రోజుకూలీ.

ఆహార కేంద్రంతోపాటు కొందరు వృద్ధుల సంరక్షణ బాధ్యతను కూడా తనపై వేసుకున్నారు ఉమారాణి. ‘‘ఎవరూ ఆకలితో బాధపడకూడదనేది నా ఆకాంక్ష. తాగుబోతులు తప్ప ఎవరైనా మా కేంద్రానికి రావచ్చు. భోజనం చేయవచ్చు. నాకు ఓపిక ఉన్నంత వరకూ అన్నదాన కేంద్రాన్ని నడుపుతాను’’ అంటున్నారీ ముప్ఫై ఆరేళ్ళ చెన్నై అన్నపూర్ణ..

Updated Date - Aug 12 , 2024 | 08:01 AM