Share News

Thrombosis : ఆ వాపులు విషమం కావచ్చు

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:23 AM

కాళ్లు వాస్తూ ఉంటాయి. నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ దూరం నడిచాం లేదంటే ఎక్కువ సేపు నిలబడి ఉన్నాం కాబట్టి కాళ్లు ...

Thrombosis : ఆ వాపులు విషమం కావచ్చు

థ్రాంబోసిస్‌

కాళ్లు నొప్పులు, వాపులు కనిపిస్తే, కాళ్లకు రెస్ట్‌ ఇవ్వాలి అనుకుంటాం. కానీ ఇవే లక్షణాలు రక్తనాళాల్లో రక్తపు గడ్డలకు కూడా సూచనలే! ఊహకందని విషమ పరిస్థితికి దారితీసే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు వైద్యులు.

కాళ్లు వాస్తూ ఉంటాయి. నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ దూరం నడిచాం లేదంటే ఎక్కువ సేపు నిలబడి ఉన్నాం కాబట్టి కాళ్లు అలసిపోయి వాచి ఉంటాయనో, నొప్పి పెడుతున్నాయనో సరిపెట్టుకుంటూ ఉంటాం!

వేడి నీళ్లలో కాళ్లను ముంచి ఉంచడం, కాపడం పెట్టడం లేదా నొప్పి మందులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఈ సమస్యను ‘థ్రాంబోసి్‌స’గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రతించాలి. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే పరిస్థితి ఇది. ఈ సమస్య నొప్పి, వాపుతో మొదలైనా పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ నడక కష్టమవుతుంది. కాలు నీలం రంగులోకి మారిపోతుంది.

మరింత ఆలస్యం చేస్తే, రక్తనాళంలో ఏర్పడిన రక్తపు గడ్డ పగిలి, ఊపిరితిత్తులకు చేరుకుని ‘పల్మొనరీ ఎంబాలిజం’ అనే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఊపిరితీసుకోలేకపోవడం, వేగంగా ఊపిరితీసుకుంటూ ఉండడం, గుండెవేగం పెరగడం, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

వీళ్లకే ముప్పు ఎక్కువ

రక్తపు గడ్డలు ఏర్పడే లక్షణం వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యక్తులు, ఊబకాయులు, గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరిగే మహిళలు, తుంటి, మోకీళ్ల మార్పిడి చేయించుకున్న వ్యక్తులు, కేన్సర్‌ రోగులు, తీవ్ర గాయాల బారిన పడినవాళ్లు, గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలైనవాళ్లు డీప్‌ వెయిన్‌ థ్రాంబోసి్‌సకు గురవుతూ ఉంటారు.


చికిత్స తీవ్రత ఆధారంగా...

కాళ్లు, చేతుల్లో థ్రాంబోసి్‌సలను అలా్ట్రసౌండ్‌, కలర్‌ డాప్లర్‌తో నిర్థారించుకోవచ్చు. డీడైమర్‌ అనే రక్తపరీక్షతో కూడా ఈ సమస్యను నిర్థారించుకోవచ్చు.

మెదడులో రక్తపు గడ్డలను ఎమ్మారైతో, పొట్టలో ఏర్పడిన రక్తపు గడ్డను సిటి స్కాన్‌తో, ఒకవేళ రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లో చేరుకుందని అనుమానం వస్తే సిటి యాంజియోతో వైద్యులు నిర్థారించుకుంటారు.

థ్రాంబోసిస్‌ ఉన్నవాళ్లకు యాంటీ కాగ్యులెంట్‌(రక్తాన్ని పలుచన చేసే మందులు) మందుల వాడకం వెంటనే మొదలుపెట్టవలసి ఉంటుంది. తర్వాత అందించే చికిత్స రోగి వ్యక్తి, సమస్య తీవ్రతల ఆధారంగా కొనసాగించవలసి ఉంటుంది.


స్వల సమస్య: కాళ్లలో థ్రాంబోసిస్‌ సమస్య స్వల్పంగా ఉండే, యాంటీ కాగ్యులెంట్స్‌తో పాటు స్టాకింగ్స్‌ వాడుకోవలసి ఉంటుంది.

తీవ్ర సమస్య: రక్తపు గడ్డను తొలగించే సర్జరీ చేయవలసి ఉంటుంది. వెయిన్‌లోకి చేరుకుని, రక్తపు గడ్డను కరిగించే మందును ఇంజెక్ట్‌ చేయడం, క్యాథెటర్‌ ద్వారా రక్తపు గడ్డను పీల్చి బయటకు రప్పించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

సర్జరీ తర్వాత కూడా ఆరు నెలల పాటు యాంటీ కాగ్యులెంట్స్‌ వాడుకోవలసి ఉంటుంది. స్టాకింగ్స్‌ కూడా వాడుకోవలసి ఉంటుంది. సర్జరీ తర్వాత, పోస్ట్‌ థ్రాంబాటిక్‌ సిండ్రోమ్‌ సమస్య తలెత్తదు.

సర్జరీ తర్వాత: వైద్యులు సూచించినంత కాలం యాంటీ కాగ్యులెంట్స్‌, స్టాకింగ్స్‌ వాడుకోవాలి. ఇతరత్రా వైద్య సమస్యల కోసం వైద్యులను కలిసినప్పుడు థ్రాంబోసిస్‌ సమస్యను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


ముందుచూపుతో...

అప్పటికే థ్రాంబోసిస్‌ సమస్య ఉండి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ఐసియులో చేరవలసి వచ్చినవాళ్లు, సర్జరీ చేయించుకోబోతున్నవాళ్లు, ఊబకాయులు, కుటుంబ చరిత్రలో థ్రాంబోసిస్‌ ఉన్నవాళ్లు ముందస్తుగానే వైద్యులకు ఆ విషయాన్ని తెలియపరచాలి.

Untitled-2 copy.jpg

ఇలా చేయడం వల్ల తర్వాతి కాలంలో థ్రాంబోసిస్‌ తలెత్తకుండా వైద్యులు అవసరమైన నివారణ చర్యలను చేపడతారు.

ఈ కోవకు చెందిన వాళ్లు థ్రాంబోసిస్‌ బారిన పడకుండా ఉండడం కోసం సరిపడా నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. డయేరియాకు గురి కాకుండా చూసుకోవాలి.


నివారణ మన చేతుల్లోనే

  • బరువును నియంత్రణలో ఉంచుకోవడం

  • కుటుంబ చరిత్రలో థ్రాంబోసిస్‌ ఉన్నవాళ్లు ఆ సమస్యను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం

  • డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవడం

  • కాళ్ల వాపులు, నొప్పులను నిర్లక్ష్యం చేయకపోవడం


అపోహలు - వాస్తవాలు

థ్రాంబోసిస్‌కు గురైనవాళ్లు పూర్తిగా బెడ్‌రెస్ట్‌కే పరిమితం కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమే! ఎక్కువ వాపు ఉంటే రెండు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, చికిత్స పూర్తయిన వెంటనే నడవడం మొదలుపెట్టాలి. నడవడం వల్ల రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుందని అనుకుంటారు. కానీ నిజానికి రక్తపు గడ్డ కాలికే పరిమితం కావాలంటే బెడ్‌రెస్ట్‌ తగ్గించి, నడుస్తూ ఉండాలి.


విమాన ప్రయాణాల్లో...

థ్రాంబోసిస్‌ సమస్య ఉన్నవాళ్లు నాలుగు గంటలకు మించి విమాన ప్రయాణాలు చేసే సమయాల్లో థ్రాంబోసిస్‌ తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి 60 ఏళ్ల వయసున్న థ్రాంబోసిస్‌ ముప్పు ఉన్న వ్యక్తులు ట్రావెల్‌ స్టాకింగ్స్‌ వాడుకోవడం తప్పనిసరి. మద్యం తీసుకోకూడదు. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే విమాన ప్రయాణం చేస్తున్నంత కాలం తరచూ లేచి నడుస్తూ ఉండాలి.


పోస్ట్‌ థ్రాంబాటిక్‌ సిండ్రోమ్‌

థ్రాంబోసిస్‌ సమస్యను చికిత్సతో సరిదిద్దిన తర్వాత కాళ్లలో తలెత్తే వీలున్న సమస్య ఇది. కాళ్లలో వాపు, రంగు మారడం, కాలిగిలకలు నల్లబడడం, పుండు ఏర్పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం వైద్యులు సూచించినంత కాలం స్టాకింగ్స్‌ వాడుకోవాలి.

కాళ్లతో పాటు చేతుల్లో కూడా థ్రాంబోసిస్‌ తలెత్తవచ్చు. అప్పుడు కూడా వాపు, నొప్పి ఉంటాయి. ఇదే సమస్య పొట్టలో ఏర్పడితే పొట్టలో నొప్పి, వాపు కనిపిస్తాయి. ఇదే సమస్య మెదడులో కూడా ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు తీవ్రమైన తలనొప్పి ప్రధాన లక్షణంగా ఉంటుంది.

డాక్టర్‌ పి.సి. గుప్తా,

- క్లినికల్‌ డైరెక్టర్‌,

హెచ్‌ఒడి వాస్క్యులర్‌ అండ్‌ ఎండోవాస్క్యులర్‌ సర్జరీ,

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Aug 06 , 2024 | 02:23 AM