Share News

Dubai: దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:42 PM

75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.

Dubai: దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి

హైదరాబాద్‌కు విమానాల అంతరాయం

రహదార్లపై స్తంభించిన లక్షలాది కార్లు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: 75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకోపోవడం వల్ల మరణించాడా లేక.. నీళ్లను చూసి గుండేపోటుతో మరణించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉందని దుబాయిలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు యస్వీరెడ్డి తెలిపారు.


మరోవైపు వరదల (floods) కారణంగా జలప్రళయానికి అతలాకుతలమైన దుబాయ్ (Dubai) నగర పౌర జీవనం ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బుధవారం కూడా మూసి ఉన్నాయి. అలాగే పాఠశాలలన్నీ శుక్రవారం వరకు ఆన్‌‌లైన్ విధానంలో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శేఖ్ జాయద్ రోడ్డుతో సహా అనేక ట్యూనళ్ళ నుంచి నీళ్ళను యుద్ధ ప్రతిపాదికన తొలగించడంతో స్తంభించిన రోడ్డు రవాణా వ్యవస్థను (Transportation system) తిరిగి పునరుద్ధరించారు.

అనేక భవవనాల్లోని సెల్లార్లు నీటితో నిండిపోవడంతో కార్లను బయటకు తీయలేని పరిస్థితి ఉందని కర్నూలు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త శేఖ్ అబ్దుల్లా తెలిపారు. సోనాపూర్, జబల్ అలీ, అల్ ఖోజ్ ప్రాంతాలోని లేబర్ క్యాంపుల్లోకి వచ్చిన వరద నీటిను తోడేసినా దుర్గంధం పోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని, అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని ఆబ్దుల్లా చెప్పారు.


కార్లు చెడిపోవడంతో తెలుగు ప్రవాసీయులకు పెద్ద నష్టం జరిగిందని మరో సామాజిక కార్యకర్త ప్రసన్న సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ సహా ప్రపంచవ్యాప్తంగా వెళ్లాల్సిన అనేక విమానాలను బుధవారం కూడా వాయిదా వేశారు. ఈ మేరకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. షార్జా, రాస్ అల్ ఖైమా ఎమిరేట్స్‌తో పాటూ పొరుగున ఉన్న ఒమాన్‌లో కూడా వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 17 , 2024 | 09:17 PM