Share News

TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!

ABN , Publish Date - Mar 30 , 2024 | 02:08 PM

Telangana Congress: తెలంగాణ టీడీపీ కీలక నేత నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) సైకిల్ దిగి.. కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేక భేటీ వెనుక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది...

TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!

తెలంగాణ టీడీపీ కీలక నేత నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) సైకిల్ దిగి.. కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేక భేటీ వెనుక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం కాస్తో కూస్తో ఉందన్నా.. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ ఇలా ఉందన్నా ఇందుకు సుహాసినీ వల్లనే అని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. అయితే ఈమె కూడా పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సుహాసిని పార్టీలో చేరితే కీలక పదవి కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది.


Suhasini-And-Revanth-Reddy.jpg

ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!

భేటీ వెనుక..?

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటు కారు దిగడం.. ఇటు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరిపోతుండటంతో హౌస్ ఫుల్ అయిపోతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటన తర్వాత కూడా కాంగ్రెస్‌లో చేరిపోతుండటం గమనార్హం. శనివారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇదే క్రమంలో నందమూరి సుహాసిని కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రేవంత్‌కు సుహాసిని పుష్పగుచ్చం అందజేశారు. ఈమెతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

Suhasini.jpg

పార్టీలో చేరితే..?

పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14 నుంచి 15 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. ఆయా పార్లమెంట్ పరిధిలో ఎవరు పార్టీలోకి రావడానికి ముందుకొచ్చినా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కండువాలు కప్పేయడం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉన్న సుహాసినీని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆమెకు పిలుపు రావడం.. సీఎం ఇంటికి వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సుహాసినికి కీలక పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎమ్మెల్సీ, లేదా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయించి.. జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా.. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సుహాసిని బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. 70,563 ఓట్లు దక్కించుకున్న ఆమె.. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు. తెలంగాణలో టీడీపీకి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సుహాసిని రంగం సిద్ధం చేసుకున్నారట. పార్టీలో ఎప్పుడు చేరిక ఎప్పుడో.. చేరిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.

Suhasini-TDP.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 02:16 PM