Share News

YSRCP: వైఎస్ జగన్‌- మోపిదేవి మధ్య అసలేం జరిగింది.. ఎందుకీ పరిస్థితి..?

ABN , Publish Date - Aug 29 , 2024 | 09:04 AM

వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ ఉన్నా రు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కు గా వ్యవహరించారు. అయితే జగన్‌ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు..

YSRCP: వైఎస్ జగన్‌- మోపిదేవి మధ్య అసలేం జరిగింది.. ఎందుకీ పరిస్థితి..?
Mopidevi Venkataramana

వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana) ఉన్నారు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అయితే జగన్‌ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. జగన్‌ సీఎం పదవిని చేపట్టక ముందు జైల్లో ఉన్న సమయంలో ఆయనతో పాటు మోపిదేవి తోటి ఖైదీగా ఉండి ఆయనకు మరింత సన్నిహితమయ్యారు. అందువల్లే ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరాజయం పాలైనా మంత్రి పదవిని కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. తదనంతర పరిణామాల్లో ఢిల్లీలో తనకు ఓ నమ్మకస్తుడు ఉండాలనే భావనతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించారు.


Mopidevi.jpg

నాటి నుంచే..?

అయితే 2024 ఎన్నికల్లో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేసినా ఆనాడు సీఎంగా ఉన్న జగన్‌ అందుకు నిరాకరించారు. కనీసం తన సోదరుడికైనా టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టినా జగన్‌ అంగీకరించలేదు. ఎన్నికలకు మందు రేపల్లెలో గణేష్‌ అభ్యర్థిత్వంలో పునరాలోచించాలని పలుమార్లు జగన్‌ను అభ్యర్థించారు. ఇదే విషయం మాట్లాడానికైతే మరోమారు తన వద్దకు రావద్దని అప్పటి సీఎం జగన్‌ ఎంపీ మోపిదేవికి చెప్పినట్లు, అదే విషయాన్ని తన అనుచరుల వద్ద చెప్పి ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా ఒక ఎత్తయితే జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాలు అప్ప చెప్పి సీట్ల ఖరారు విషయంలో నామమాత్రంగా కూడా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని అవమానంగా మోపిదేవి భావించారు. దీనికి తోడు ఇష్టంలేని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో అప్పటి నుంచి మోపిదేవి మనస్థాపానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాల విడుదలయిన దగ్గర నుంచి ఎంపీ మోపిదేవి వైసీపీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తద్వారా రాజ్యసభ సభ్యుడి పదవిని కూడా వదులుకునేందుకు ఆయన సిద్ధం కావడం విశేషం. ఒకటి రెండ్రోజుల్లో రాజ్యసభ చైర్మన్‌తో ప్రత్యేకంగా సమావేశమై రాజీనామా చేయబోతున్నారు. ఈయనతో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా జాబితాలో ఉన్నారు.


YS-Jagan-And-Mopidevi.jpg

టీడీపీ ఖాతాలోకి రేపల్లె మున్సిపాలిటీ?

తీరప్రాంతంలో ఎంపీ మోపిదేవికి తన వెంట నడిచే అనుచరగణం గట్టిగానే ఉంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఆయన వెంట ఉంది. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేర నుండడంతో రేపల్లె నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు టీడీపీకి (Telugu Desam) మరింత అను కూలంగా మారనున్నాయి. ఎంపీ మోపిదేవి రాజీనామాతో రేపల్లెలో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్లేననే అభిప్రాయానికి ఆ పార్టీ శ్రేణులే వచ్చాయి. రేపల్లె మున్సి పాలిటీలో మొత్తం 28 కౌన్సిలర్లకు వైసీపీ బలం 26గా ఉంది. మోపిదేవితో పాటు పెద్దఎత్తున వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. దీంతో మారనున్న రాజకీయ సమీకరణాల ప్రకారం రేపల్లె మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.


Mopidevi-2.jpg

ఉమ్మడి గుంటూరు ఖాళీ..

తిరుగేలేదు.. 30 ఏళ్లు మాదే అధికారం.. ఇక ప్రతిపక్షం ఆనవాళ్లే ఉండవు.. అని విర్రవీగిన వైసీపీ ప్రస్తుతం విలవిలలాడుతోంది. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతో అల్లాడిపోతోంది. ఈ పరిస్థితుల్లో పలువురు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో నేతల్లో గందరగోళం నెలకొనగా.. క్యాడర్‌ కలవరపడుతోంది. మొత్తమ్మీద 2019 ఎన్నికల్లో ఘన విజయంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ వెలుగువెలిగిన ఫ్యాన్‌ పార్టీ ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీ నేతలు పలువురు అధినేత జగన్‌కు షాక్‌ ఇచ్చారు. ఎన్నికల అనంతరం కూడా అదే పరంపర కొనసాగుతూ వస్తోంది. పార్టీ పరాజయం అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మద్ధాళి గిరి, కిలారి రోశయ్య రాజీనామా చేయగా తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత అదే బాట పట్టారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరాలనే నిర్ణయం వైసీపీ నేతలను మరింత కలవరపరుస్తోంది.

Mopidevi-3.jpg

Updated Date - Aug 29 , 2024 | 09:30 AM