Share News

Andhra Pradesh: ప్రభుత్వం మారినా ఏపీ పోలీసుల తీరు మారలేదే!

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:14 PM

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP) పోయి టీడీపీ (TDP) కూటమి సర్కార్ వచ్చినా రాష్ట్ర పోలీసు శాఖలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు..! సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని..

Andhra Pradesh: ప్రభుత్వం మారినా ఏపీ పోలీసుల తీరు మారలేదే!

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP) పోయి టీడీపీ (TDP) కూటమి సర్కార్ వచ్చినా రాష్ట్ర పోలీసు శాఖలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు..! సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని ఉన్నతాధికారులు మొదలుకుని సీఎం నారా చంద్రబాబు వరకూ చెప్పినా ఇసుమంత కూడా మారలేదు..! ఆఖరికి తన కాన్వాయ్ కోసం కూడా ట్రాఫిక్ ఆపొద్దని.. ప్రత్యేకించి ఏమీ చర్యలు తీసుకోనక్కర్లేదని కూడా స్వయానా సీబీఎన్ చెప్పినా మార్పు రాకపోవడం గమనార్హం. ‘మేమింతే.. ఎందుకు మారాలి.. మేం చెప్పిందే శాసనం’ అన్నట్లుగా కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రాఫిక్‌ డైవర్షన్ విషయంలో అయితే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ ఖాకీల తీరుతో ప్రజలు విస్తుపోతున్నారు.


AP-Police--Dept.jpg

మార్పు రాదా..?

గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి రోడ్డుపైకి వస్తే పోలీసులు ఎంత హడావుడి చేసేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దారిపొడవునా ఆ పరదాలు, చెట్లు నరికేయడం.. షాపులు మూయించేయడం.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేయడం ఇలా ఒకటా రెండా బాబోయ్ అవన్నీ మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే..! ఆఖరికి వైఎస్ జగన్ ఫ్లైట్‌లో వెళ్లినా రోడ్డుపైన ట్రాఫిక్ ఆపిన సందర్భాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు స్వామి భక్తి చాటుకుంటున్నారు.! అందుకే వైసీపీతో అంటకాగిన, ఇంకా తీరు మార్చుకోని వారిని పక్కనెట్టాలని ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. పోలీస్ శాఖలో ప్రక్షాళన చేస్తున్నట్లు ఇదివరకే నారా చంద్రబాబు క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఈ క్రమంలోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ, పోస్టింగ్ ఇవ్వకుండా చేయడం మనం చూసే ఉంటాం. ఇంత జరిగినా సరే పోలీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు.


ఏం జరిగింది..?

విజయవాడలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పోలీసు వాహనాలు మినహా.. ఏ ఇతర వాహనాలను అనుమతించట్లేదు. నో ఎంట్రీ అని కొన్ని చోట్ల బోర్డులు పెట్టేయడం, మరికొన్ని చోట్ల రూట్లు మార్చడం జరిగింది. పోలీసుల ఆంక్షలతో సామాన్య ప్రజలు, వాహనదారులు, అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసుల తీరుపై సామాన్యుడు మండిపడుతున్నాడు. మాకేంటీ కర్మ..? పోలీసులు ఎందికిలా చేస్తున్నారు..? ప్రభుత్వాలు మారినా పైత్యం మాత్రం మారదా..? అంటూ తిట్టిపోస్తున్న పరిస్థితి. అలాగనీ.. పోలీస్ శాఖలో అందరూ ఇలానే ఉన్నారా అంటే అదేమీ లేదు. కొందరి ప్రవర్తనతో డిపార్ట్‌మెంట్ మొత్తానికే చెడ్డపేరు వస్తోందని విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు.


DGP-Tirumala-Rao.jpg

కొత్త బాస్ రంగంలోకి దిగేదెప్పుడో..!

డీజీపీ.. తిరుమల రావు అంటే ఒక బ్రాండ్ అనే పేరుంది..! రావు రంగంలోకి దిగితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..! ఈయనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే.. తనదైన మార్క్ చూపిస్తుంటారు. అలాంటిది ఆయన ఛార్జ్ తీసుకుని ఇన్ని రోజులు కావొస్తున్నా ఇంకా ఎందుకు తన మార్క్ చూపించట్లేదు..? ఈ మధ్యనే చంద్రబాబు పిలిపించి మరీ మాట్లాడి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా ఎందుకు మార్పు రాలేదన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహాలు. అయితే.. ఇప్పుడిప్పుడే అసలు సిసలైన సినిమా ఉంటుందని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. మరి పోలీసుల్లో మార్పు ఎప్పుడు వస్తుందో..? ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎప్పుడు చేస్తారో ఏంటో చూడాలి మరి.

బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 26 , 2024 | 01:25 PM