Viral Video: కారు ఉంది కదా అని అడ్డగోలుగా వెళ్లిన వ్యక్తికి షాక్ ఇచ్చిన కేరళ పోలీసులు..
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:27 PM
కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్‌లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్‌కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంబులెన్స్ అంటే ఎటువంటి వాహనమో అందరికీ తెలిసిందే. మనుషుల ప్రాణాలకు అత్యంత ప్రమాదం ఏర్పడినప్పుడు వారిని అందులో తరలిస్తుంటారు. అంబులెన్స్ వస్తుందంటే ఎవరైనా దారిస్తారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా ఆ వాహనానికి దారిచ్చేందుకు పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే ఓ ప్రాణాన్ని నిలబెట్టేందుకే అది వెళ్తుందని తెలుసు కాబట్టి. కానీ కొంత మంది మూర్ఖులు మాత్రం.. అలాంటివి ఏమీ తమకు పట్టనట్లు జాలీకి రోడ్డుపై వెళ్తుంటారు. కనీసం వెనక వచ్చే వాహనం ఏంటి, ఏ పరిస్థితుల్లో వెళ్తోందనే విషయాలు వారికి పట్టవు. అలా ప్రవర్తించిన వ్యక్తికి షాక్ ఇచ్చారు కేరళ పోలీసులు.
కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్‌లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్‌కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. తన కారు వెనకాల ఉన్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూ, హారన్ కొడుతూ పక్కకు వెళ్లమని ఎంత సిగ్నల్ ఇచ్చినా కారు యజమాని మాత్రం లెక్కచేయలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దారివ్వకుండా ఇబ్బంది పెట్టాడు. దీంతో అంబులెన్స్‌లోని ఓ వ్యక్తి.. కారు డ్రైవర్ చేస్తున్న తతంగాన్ని మెుత్తం వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అయితే ఈ వీడియో కాస్త తెగ వైరల్‌గా మారింది. కనికరం లేకుండా మనిషి అనే వాడు ఎవరైనా సరే ఇలా చేస్తారా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరంగా వెళ్తున్న వాహనానికి దారివ్వకుండా ఈ పిచ్చి పని ఏంటి అంటూ అతడిపై మండిపడ్డారు. ఈ వీడియో కాస్త కేరళ పోలీసులు దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు కారు యజమాని గురించి ఆరా తీశారు. చివరికి అతను ఎవరు, ఎక్కడ నివసిస్తారనే విషయాన్ని వాహనం నంబర్ ద్వారా సాధించారు.
అనంతరం అతడి ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారు. అంబులెన్స్‌కి దారివ్వపోవడానికి గల కారణాలను అడిగారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించారు. రూ.2.5లక్షల జరిమానాతోపాటు లైసెన్స్ రద్దు చేశారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కారు ఓనర్ చేసిన పనికి తగిన శాస్తి జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేరళ పోలీసులు తీసుకున్న చర్యలకు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..