Viral: 20 ఏళ్లుగా ఇక్కడుంటున్నా..ఏసీ అవసరం పడుతుందని మాత్రం అనుకోలేదు: బెంగళూరు మహిళ
ABN , Publish Date - May 03 , 2024 | 03:13 PM
బెంగళూరులో 20 ఏళ్లుగా ఉంటున్న ఓ మహిళ తనకు ఏసీ అవసరం పడుతుందని ఏనాడూ అనుకోలేదని చెప్పింది. ఇటీవల తన బెడ్ రూంలో అమర్చుకున్న ఏసీ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో (Bengaluru) 20 ఏళ్లుగా ఉంటున్న ఓ మహిళ తనకు ఏసీ అవసరం పడుతుందని ఏనాడూ అనుకోలేదని చెప్పింది. ఇటీవల తన బెడ్ రూంలో అమర్చుకున్న ఏసీ ఫొటోను కూడా షేర్ చేసింది. ఒకప్పటి బెంగళూరుకు ఇప్పటి నగరానికి ఎంతో వ్యత్యాసం ఉందంటూ ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
ఒకప్పుడు బెంగళూరు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన సమశీతల వాతావరణమే. కానీ నేడు నగరం.. నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలకు పర్యాయపదంగా మారింది. కూలర్ల అవసరం కూడా లేని నగర వాసులు ప్రస్తుతం ఏసీల కోసం ఎగబడుతున్నారు. ఇన్వెస్టర్, ఈక్విటీ రీసెర్చర్ అయిన ప్రేరణ నిరీక్ష అమ్మన్న కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Viral: తన గదిలో దెయ్యాలు ఉన్నాయని బాలిక గోలపెడుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు! చివరకు..
‘‘20 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నా నాకు ఏసీ అవసరం అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు నగరం గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం గురించి చెప్పి సమర్థించుకునే వాళ్లం. ఇప్పుడా అవకాశమూ లేకుండా పోయింది. ఇంత వేడిగా ఎందుకు ఉంటోందో? ఇది బెంగళూరు కాదు రాజస్థాన్ అన్నట్టు ఉంది. ప్రతి ఏడాది ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వేడిని భరించలేకుండా ఉన్నాం’’ అని ఆమె పోస్ట్ చేశారు (Bengaluru Womans Post on buying AC goes viral).
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బెంగళూరు వాసులు అనేక మంది ప్రేరణతో ఏకీభవించారు. 2016లో కొన్న కూలర్‌ను తాను ఇన్నాళ్లకు మళ్లీ వాడాల్సి వస్తోందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 1970ల్లో బెంగళూరు స్వర్గంలా ఉండేదని ఇప్పుడది నరకంలా మారిందని చెప్పారు. ఉష్ణోగ్రతలు ఏటా పెరుగుతూనే ఉన్నాయని, భూతాపం పెరుగుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.