Viral: సఫారీ జీప్‌పై దాడికి సిద్ధమైన మగ ఏనుగు.. చివరి నిమిషంలో.. షాకింగ్ వీడియో!
ABN , Publish Date - May 02 , 2024 | 05:04 PM
సఫారీ జీపుపై దాడి చేసేందుకు సిద్ధమైన ఓ ఏనుగు చివరి నిమిషంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సఫారీ పర్యటనలతో వచ్చే ప్రమాదాలను ఈ వీడియో హైలైట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సఫారీలతో పొంచి ఉండే ప్రమాదాల గురించి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. సఫారీలో పర్యాటకులు చివరి నిమిషంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తీరు జనాలను షాక్‌కు గురి చేస్తోంది. ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ పాండే ఈ వీడియోను షేర్ చేశారు.
వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, కొందరు పర్యాటకులు జీపుల్లో వణ్యప్రాణులను సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. సఫారీ జీపులను చూసి తిక్కరేగిన ఓ ఏనుగు దాడికి సిద్ధమైంది. ప్రయాణికులతో ఉన్న ఓ జీపు వైపు దూసుకువచ్చింది. వాహనాన్ని డొల్లించి పడదోసేందుకు కూడా సిద్ధమైంది. ఈలోపు ఇతర జీపుల్లోని ప్రయాణికులు, సిబ్బంది పెద్ద ఎత్తున అరుస్తూ దాన్ని తోలేందుకు ప్రయత్నించారు. ఈ గలాటా చూసి బెదిరిన మగ ఏనుగు చివరి నిమిషంలో దాడి ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరిగింది (Safari jeep filled with tourists comes dangerously close to elephant).
Viral: భార్య పోయాక.. మామ ఇంట్లో సెటిలై.. చివరకు అత్తను మనువాడిన అల్లుడు!
ఈ ఘటన ఎక్కడ జరిగిందీ మాత్రం తెలియరానప్పటికీ ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో జరిగినదని వీడియోలోని క్యాప్షన్లను బట్టి కొందరు చెబుతున్నారు. రిజర్వ్ ఫారెస్టుల్లో సఫారీ పర్యటనలతో కలిగే ప్రమాదాల గురించి ఈ వీడియో హైలైట్ చేసింది. వనాల్లో పర్యటనలకు సంబంధించి నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఏర్పరిచిన మార్గదర్శకాలను పాటించాలని కూడా వీడియో క్యాప్షన్‌లో ఉంది.
ఈ వీడియోపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పర్యటనలతో వణ్యప్రాణులపై పెను ప్రభావం పడుతుందని కొందరు అన్నారు. సఫారీ పర్యటనలకు సంబంధించి మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించేవారిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేశారు. వీడియో చూసిన వారే ఇంతలా బెదిరిపోతే ఇక ప్రత్యక్షంగా ఈ పరిస్థితి ఎదుర్కొన్న వారు ఎంతగా భయపడి ఉంటారో అంటూ మరి కొందరు కామెంట్ చేశారు.