Share News

Viral News: ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు.. వివాహ వేడుకకు హాజరైన వ్యక్తికి విచిత్ర పరిస్థితి..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:48 PM

గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన యువకుడికి పొరుగున ఉన్న డియోరియా జిల్లాకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ మేరకు బుధవారం రాత్రి పెళ్లి బృందం డియోరియా జిల్లా తార్కుల్వా గ్రామానికి చేరుకుంది.

Viral News: ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు.. వివాహ వేడుకకు హాజరైన వ్యక్తికి విచిత్ర పరిస్థితి..

ఉత్తర్ ప్రదేశ్: డియోరియా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహ వేడుక కోసం ఓ గ్రామానికి వెళ్లిన యువకుడిపై గ్రామస్థులంతా కలిసి దాడి చేశారు. అతనేమైనా తప్పు చేశాడా అంటే అదీ లేదు. కానీ తాళ్లు, గొలుసులతో కరెంట్ స్తంభానికి కట్టేసి మరీ విపరీతంగా కొట్టారు. కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చిన్న పొరబాటు కాస్త అతని ప్రాణాల మీదకు తెస్తుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. పోలీసుల ప్రమేయంతో తప్పు చేశామని భావించిన గ్రామస్థులు బాధితుడిని విడిచిపెట్టారు. అయితే దాడికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన యువకుడికి పొరుగున ఉన్న డియోరియా జిల్లాకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ మేరకు బుధవారం రాత్రి పెళ్లి బృందం డియోరియా జిల్లా తార్కుల్వా గ్రామానికి చేరుకుంది. వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుక అనగానే మందు, చిందు ఉండాల్సిందే అన్నట్లు వరుడి తరఫు యువకులు అంతా కలిసి మద్యం సేవించారు. ఇక ఊరేగింపుగా నవజంటను గోరఖ్‌పూర్ తీసుకెళ్లేందుకు బయలుదేరారు. ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం మెుదలుపెట్టారు. అయితే పెళ్లి కొడుకు స్నేహితుడికి మద్యం ఎక్కువైంది. డాన్సు చేసినంత సేపు చేసి ఆ తర్వాత ఊరేగింపు బృందం నుంచి అతను విడిపోయాడు. మద్యం మత్తులో ఎటు వెళ్తున్నాడో అతనికే అర్ధం కాలేదు. మిగిలిన వారు సైతం మద్యం మత్తు, ఊరేగింపు హడావుడిలో ఉండి యువకుడి గురించి మర్చిపోయారు.


అయితే దారి తప్పిన ఆ యువకుడు తార్కుల్వా గ్రామంలోని ఓ వీధిలోకి చేరుకున్నాడు. అనంతరం ఓ ఇంటి ముందుకి వెళ్లి తలుపు కొట్టాడు. ఆ వీధిలో రెండ్రోజుల క్రితమే దొంగతనం జరగడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడిని చూసి ఆ కుటుంబం దొంగగానే భావించింది. దీంతో వెంటనే కేకలు వేయడం ప్రారంభించారు. వారి అరుపులు విని పెద్దఎత్తున గుమిగూడిన స్థానికులు యువకుడిని పట్టుకున్నారు. ఎవ్వరు నువ్వు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. మత్తు కారణంగా అతను సరిగా మాట్లాడలేకపోయాడు. దీంతో దొంగగా భావించి అందరూ అతనిపై దాడికి పాల్పడ్డారు.


తాళ్లు, ఇనుప గొలుసులతో విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టారు. కర్రలతో కొడుతూ.. కాళ్లు, చేతులతో పిడిగుద్దులు కురిపించారు. గ్రామస్థుల దాడిలో యువకుడి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అతడిని రక్షించారు. పెళ్లి బృందం నుంచి విడిపోయిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కుటుంబసభ్యులకు అతన్ని అప్పగించారు. అయితే యువకుడిని దొంగగా భావించి దాడి చేయడంపై గ్రామస్థులంతా చింతించారు. తప్పు చేశామంటూ ఆవేదనకు గురయ్యారు. అయితే దాడికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Updated Date - Nov 30 , 2024 | 01:11 PM