Viral: వామ్మో.. అమెరికాలో ఇలాంటి దృశ్యమా.. ఆశ్చర్యపోతున్న భారతీయులు
ABN , Publish Date - May 09 , 2024 | 03:59 PM
అమెరికాలో ఆటో తిరుగుతున్న దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారత ప్రభావం అమెరికాపై ఎక్కువగానే ఉందంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులందరికీ తెలిసిన ప్రయాణ సాధనం ఆటో. భారత్‌తో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఆటో కనిపిస్తుంటుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది దాదాపుగా ఉండదు. భారత్ గురించి తెలిసిన కొందరు దీన్ని టుక్ టుక్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే, అమెరికాలో ఇటీవల ఈ ఆటో కనిపించడం నెట్టింట సంచలనానికి (Viral) దారి తీసింది.
కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తి ఈ ఆటోను చూడటం, కెమెరాలో బంధించి నెట్టింట పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. మనదేశంలోని ఆటోల్లాగానే అది నలుపు పసుపు పచ్చ రంగుల్లో ఈ ఆటో ఉంది. మనోహర్ సింగ్ అనే యూజర్ దీన్ని నెట్టింట పంచుకున్నారు. కాలిఫోర్నియాలో ఆటో.. అంటూ తన వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జతచేశారు (Video of auto-rickshaw in California leaves Internet in frenzy).
ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారతీయతకు పర్యాయపదంగా మారిన ఆటో అమెరికాలో ఏం చేస్తోందని అనేక మంది ప్రశ్నించారు. అమెరికాపై భారతీయ ప్రభావం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని కొందరు అన్నారు.
Viral: అయ్యో.. ఊబకాయంతో అనూహ్య సమస్య.. అంత్యక్రియల్లో జాప్యం!
వాస్తవానికి ఆటోలు భారత్‌తో పాటు కొన్ని ఆసియా దేశాల్లోనూ దర్శనమిస్తాయి. పాశ్చాత్యదేశాల్లో మాత్రం ఇవి దాదాపుగా ఉండవు. ఒకటి రెండూ అక్కడక్కడా కనిపించినా అవి పర్యాటకుల ఆకర్షణగానే వినియోగిస్తారు. సాధారణ ప్రయాణాలకు వాడరు. ఆటో రూపొందించి తీరే ఇందుకు కారణం.
ఆటోలో ప్రత్యేకంగా డోర్ల వంటివి ఏమీ ఉండవు. దీంతో, బయటి చలి లేదా వేడి లోపలి ప్రయాణికులకు నేరుగా తగులుతుంది. ఈ తరహా డిజైన్ ఉష్ణమండల ప్రాంతాలకు సరిపోతుంది కానీ శీతలవాతావరణం ఉండే పాశ్చాత్య దేశాలకు ఇది అనువు కాదని పరిశీలకులు అంటుంటారు. ఇక ఆటో ఖరీదు స్వల్పమే అయినా అక్కడ ఇదే ఖర్చుతో సులభంగా కారు కొనుగోలు చేయొచ్చు. దీంతో, అక్కడివారు ఆటోల వైపు మొగ్గు చూపే అవకాశం తక్కువని చెబుతుంటారు. కేవలం 65 కిలోమీటర్ల గరిష్ఠ వేగం కలిగిన ఆటోలు అక్కడి ప్రయాణవేగానికి సరితూగవని కూడా కొందరు అంటుంటారు.