Share News

CATCH CONTROVERSY: వివాదంలో సూర్యకుమార్ క్యాచ్.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆగ్రహం..

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:43 AM

క్రికెట్ ప్రపంచకప్‌ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.

CATCH CONTROVERSY: వివాదంలో సూర్యకుమార్ క్యాచ్.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆగ్రహం..
Suryakumar Yadav

క్రికెట్ ప్రపంచకప్‌ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి. వైడ్ బాల్స్‌ను అంపైర్ రైట్ బాల్‌గా ఇవ్వడం, నోబాల్స్‌ విషయంలో జరిగే తప్పిదాలు మ్యాచ్‌పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు జట్టు విజయపజయాలను డిసైడ్ చేస్తాయి. ఇలాంటి సంఘటనలు గతంలో చూశాం. మ్యాచ్ పూర్తై విజేతను ప్రకటించిన తర్వాత ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తుంటాయి. ఓటమిని కవర్ చేసుకోవడానికి కొన్నిసార్లు లేని వివాదాలను తెరపైకి తెస్తుంటారు. ఏది ఏమైనా క్రికెట్‌లో అంపైర్‌దే తుది నిర్ణయం. గ్రౌండ్ వదిలి వచ్చాక అంపైర్ నిర్ణయంపై ఎన్ని విమర్శలు చేసినా మ్యాచ్ ఫలితం మారదు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, భారత్ మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి ఓవర్ వరకు అధిపత్యం చెలాయించింది. చివరి ఓవర్‌లో విజయానికి దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాలి. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ ఉన్నారు. పాండ్యా వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని గాల్లోకి కొట్టాడు. బౌండరీ లైన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అంతా అది సిక్స్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. భారత్‌‌కు గెలుపునందిస్తూ.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తీసుకున్నాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి భారత్ వైపు మళ్లింది. చివరికి 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.


క్యాచ్‌పై వివాదం

సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌పై ఫీల్డ్ అంఫైర్ ధర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రెండు, మూడు సార్లు పరిశీలించిన తర్వాత అవుట్‌గా ప్రకటించారు. దీంతో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ పట్టడంతో.. భారత్ డకౌట్‌లో ఆనందం కనిపించింది. మరోవైపు సౌతాఫ్రికా ఆటగాళ్లతో పాటు.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ పూర్తైన తర్వాత ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. సూర్యకుమార్ యాదవ్ షూ బౌండరీ లైన్‌ను తాకిందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. థర్డ్ అంపైర్ బిగ్ స్క్రీన్‌లో చూసిన తర్వాత తుది నిర్ణయం వెల్లడించాడు. అయినప్పటికీ మరో రెండు మూడు సార్లు పరిశీలించి ఉండాల్సిందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ భారత్ గెలుచుకున్నప్పటికీ.. సూర్యకుమార్ క్యాచ్ చుట్టూ వివాదం నడుస్తోంది. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest telugu News

Updated Date - Jun 30 , 2024 | 11:43 AM