Virat Kohli: కోహ్లీకి రెండో సంతానంపై డివిల్లియర్స్ యూటర్న్.. పెద్ద తప్పు చేశానని కామెంట్స్
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:33 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడంటూ ఇటీవల ప్రకటించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడంటూ ఇటీవల ప్రకటించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అసలు ఏం జరిగిందంటే.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మూడు, నాలుగో టెస్టుకు కూడా కోహ్లీ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం తన యూట్యూబ్ చానెల్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్ అభిమానులతో ముచ్చటించాడు. దీంతో విరాటో కోహ్లీతో మాట్లాడారా? అతను ఎలా ఉన్నాడు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు.
ఈ క్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ ‘‘ఇటీవల కోహ్లీతో చాటింగ్ చేశాను. ఎలా ఉన్నావని అడగగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. కోహ్లీ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతను తన కుటుంబంతో ఉండడం ముఖ్యం. చాలా మంది వ్యక్తుల మొదటి ప్రాధాన్యత వారి కుటుంబమే అని నేను భావిస్తున్నాను. అందుకు మీరు కోహ్లీను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కోహ్లీని కోల్పోతున్నాం. కానీ అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు. ’’ అని చెప్పాడు. కానీ తాజాగా ఈ వ్యాఖ్యలపై డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. తాను తప్పు చేశానని, విరాట్-అనుష్క జంట తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ కంటే కుటుంబమే మొదటి ప్రాధాన్యత. నేను నా యూట్యూబ్ చానెల్‌తో పెద్ద తప్పు చేశాను. కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడనే సమాచారం తప్పు. అది నిజం కాదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీనిపై కోహ్లీ కుటుంబమే స్పష్టత ఇస్తుందని నేను భావిస్తున్నాను. కోహ్లీ త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను. కారణం ఏదైనా బలంగా, మెరుగ్గా జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని ఆశిస్తున్నాను.’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ తాజా వ్యాఖ్యలతో విరాట్ కోహ్లీ అభిమానులు నిరాశకు గురయ్యారనే చెప్పుకోవాలి. అయితే కోహ్లీ టీమిండియాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలియక అభిమానులతోపాటు అందరిలో అయోమయం నెలకొంది. దీంతో దీనిపై కోహ్లీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.