Share News

IPL 2024 Opening Ceremony: ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న బడా సెలబ్రెటీలు వీళ్లే!

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:55 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

IPL 2024 Opening Ceremony: ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న బడా సెలబ్రెటీలు వీళ్లే!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లపై ఎంత క్రేజ్ ఉంటుందో టోర్నీ ప్రారంభ వేడుకలపై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఓపెనింగ్ గేమ్‌కు ముందు నిర్వహించే ప్రారంభ వేడుకల్లో తారల ప్రదర్శనల కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రారంభ వేడుకలు నిర్వహిస్తుంటారు. గతేడాది నిర్వహించిన ప్రారంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, రష్మిక మందన్న, తమన్నా భాటియా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


ఈ సారి కూడా ప్రారంభ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ మ్యాచ్ జరిగే చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే ఈ వేడుకలు కూడా జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభ వేడుకలు ప్రారంభంకానున్నాయి. గంటపాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ నెట్‌‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారంకానున్నాయి. ఈ సారి ప్రారంభ వేడుకల్లో ప్రముఖ బాలీవుడు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్.. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ ఏఆర్ రెహ్మాన్, సోనూ నిగమ్ తదితరులు సందడి చేయనున్నారని సమాచారం. కాగా చెన్నై, బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ప్రారంభ మ్యాచ్ మినహా రాత్రి జరిగే మిగతా అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభంకానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 12:55 PM