IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ABN , Publish Date - Apr 02 , 2024 | 06:14 PM
ఐపీఎల్ 2024 షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సింది.
ఐపీఎల్ 2024 (IPL 2024) షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్‌లను బీసీసీఐ(BCCI) రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్(Kolkata knight riders vs Rajasthan royals) మధ్య మ్యాచ్ జరగాల్సింది. అలాగే ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(Gujarat titans vs Delhi capitals) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. 17న కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక రోజు ముందుగా 16న జరగనుంది. అలాగే 16న జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఒక రోజు ఆలస్యంగా 17న జరగనుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల తేదీల్లో మాత్రమే మార్పులు చోటుచేసుకున్నాయి. వేదికల్లో ఎలాంటి మార్పులు లేవు. అదే వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే మిగతా మ్యాచ్‌లన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే ఈ రెండు మ్యాచ్‌ల రీషెడ్యూల్‌కు గల కారణాన్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.
కానీ పీటీఐ కథనం ప్రకారం.. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి ఉండడంతో కోల్‌కతా, రాజస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చినట్టు సమాచారం. కోల్‌కతాలో రామనవమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీంతో భారీగా పోలీస్ భద్రత అవసరమవుతుంది. మరోవైపు ఎన్నికల హడావిడి కూడా ఉంది. దీంతో అదే రోజు మ్యాచ్ కూడా నిర్వహిస్తే భద్రత పరంగా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు చెప్పారు. విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బీసీసీఐ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కాగా బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను 7 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇక హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. రెండు విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో, మూడింటిలో రెండు గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్ మూడో స్థానంలో, మూడింటిలో రెండు గెలిచిన గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..
MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..