David Warner: చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా..
ABN , First Publish Date - 2024-02-10T10:59:21+05:30 IST
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్ చరిత్రలో 100 హాఫ్ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. తన కెరీర్‌లో మొత్తంలో ఇప్పటివరకు 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు.
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్ చరిత్రలో 100 హాఫ్ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. తన కెరీర్‌లో మొత్తంలో ఇప్పటివరకు 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు. 91 హాఫ్ సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా వార్నర్ ఈ ఘనత అందుకున్నాడు. 37 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇటీవల అంతర్జాతీయ టెస్టు, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. టెస్టులు, వన్డేల నుంచి రిటైర్ అయిన తర్వాత వార్నర్ ఆడిన తొలి టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ద్వారా వార్నర్ మరో రికార్డును కూడా చేరుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వార్నర్‌కు ఇది 100వ టీ20 మ్యాచ్. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, వన్డేల్లో కూడా వార్నర్ 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ కంటే ముందు ఈ రికార్డును టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ అందుకున్నారు. దీంతో వార్నర్ కూడా కోహ్లీ, టేలర్ సరసన చేరాడు. టేలర్ 2020 ఫిబ్రవరిలో ఈ మార్కు అందుకోగా.. కోహ్లీ 2022లో ఈ రికార్డును అందుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో కంగారులను విజయం వరించింది.