Share News

Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధాన్ని గెలిపించాడు.. కొడుకు టీమిండియాను గెలిపించాడు.. ఈ తండ్రి కొడుకుల కథపై ఓ లుక్కేయండి!

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:10 PM

ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల నోట్లో నానుతున్న పేరు ధృవ్ జురేల్. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా గెలవడంలో ధృవ్ జురేల్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 161 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ధృవ్ జురేల్ అద్భుతంగా ఆడాడు.

Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధాన్ని గెలిపించాడు.. కొడుకు టీమిండియాను గెలిపించాడు.. ఈ తండ్రి కొడుకుల కథపై ఓ లుక్కేయండి!

ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల నోట్లో నానుతున్న పేరు ధృవ్ జురేల్. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా గెలవడంలో ధృవ్ జురేల్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 161 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ధృవ్ జురేల్ అద్భుతంగా ఆడాడు. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 200 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. కానీ టేలెండర్ల సాయంతో అద్భుత పోరాటం చేసిన ధృవ్ జురేల్ జట్టు స్కోర్‌ను ఏకంగా 300 దాటించాడు. ఈ క్రమంలో 6 ఫోర్లు, 4 సిక్సులతో 90 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటిన జురేల్ 192 పరుగుల లక్ష్య చేధనలో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 120 పరుగులకే భారత జట్టు సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చన జురేల్ గిల్‌తో కలిసి అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియాను గెలిపించాడు. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడిన జురేల్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ధృవ్ జురేల్‌కే దక్కింది. కాగా తాను అరంగేట్రం చేసిన మూడో టెస్టులోనూ జురేల్ 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

22 ఏళ్ల వయసులోనే జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ధృవ్ జురేల్ అద్భుతమైన పోరాట పటిమ చూపుతున్నాడు. టేలెండర్లతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నాడు. స్వతహాగా కార్గిల్ యుద్ధ వీరుడి కొడుకైన ధృవ్ జురేల్ ఆటలో తన పోరాటాన్ని కనబరుస్తున్నాడు. ధృవ్ జురేల్ తండ్రి నేమ్ చంద్‌ కార్గిల్ యుద్ధ వీరుడు. 1999వ సంవత్సరంలో మే 3 నుంచి జులై 26 వరకు భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను తిరిగి స్వాధీనపరచుకుంది. చరిత్రలో కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకమైన పేజీలే ఉన్నాయి. అంత గొప్ప యుద్ధంలో ధృవ్ జురేల్ తండ్రి నేమ్ చంద్‌ కూడా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధృవ్ జురేల్ తండ్రి నేమ్ చంద్‌ తన లాగే తన కొడుకు కూడా ఆర్మీలో చేరాలని ఆశించారు. లేదంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకున్నారు. కానీ ధృవ్ జురేల్ మాత్రం ఇవేవి కాకుండా క్రికెట్ వైపు వెళ్లాడు.


ఓ రోజు తన తండ్రితో తాను క్రికెటర్ కావాలనుకుంటున్న విషయాన్ని చెప్పాడు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. ధృవ్‌కు మాత్రం క్రికెటర్ కావాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. తనకు క్రికెట్ కిట్ కొనివ్వమని అడిగాడు. కానీ వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వాళ్ల నాన్న కొనివ్వలేదు. దీనికి తోడు క్రికెట్ ఆడనివ్వడం లేదు. దీంతో ఇంట్లో నుంచి పారిపోవాలని ధృవ్ జురేల్ నిర్ణయించుకున్నాడు. విషయం తల్లితో చెప్పడంతో ఆమె భయపడిపోయింది. ధృవ్ తల్లి తన మెడలోని బంగారు గొలుసు అమ్మి వచ్చిన డబ్బుతో కొడుకుకు క్రికెట్ కిట్ కొనిచ్చింది. దీంతో ధృవ్ ఒక్కడే 13 ఏళ్ల వయసులో ఆగ్రా నుంచి నోయిడాకు ప్రయాణించి కోచ్ ఫూల్ చంద్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చాడనే అనుమానంతో ఫూల్ చంద్.. నేమ్ చంద్‌కు ఫోన్ చేశారు. తనకు పని ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పడంతో ధృవ్‌ను ఫూల్ చంద్ తన అకాడమీలో చేర్చుకుని శిక్షణ ఇచ్చారు. సబ్ జూనియర్ స్థాయి నుంచి నిలకడగా రాణిస్తూ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ధృవ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్లతో కలిసి జూనియర్ ప్రపంచకప్ ఆడాడు. ఆ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

ఆ తర్వాత ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ధృవ్‌కు చోటు దక్కింది. సీజన్‌కు 20 లక్షల రూపాయల కాంట్రాక్టుతో రాజస్థాన్ ఫ్రాంచైజీకి ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంతో ధృవ్ ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. ఐపీఎల్‌లో భాగంగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధృవ్ జురేల్ 15 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు. ఇది చూసిన అతని తండ్రి నీమ్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రి భావోద్వేగంపై స్పందించిన ధృవ్ ‘ఇది ప్రారంభం మాత్రమే’ అని అప్పట్లోనే చెప్పాడు. ఇప్పటి వరకూ ఆడిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 46 సగటుతో 790 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోడం, కేఎస్ భరత్ వరుస వైఫల్యాలు ధృవ్ జురెల్‌కు కలసి వచ్చాయి. దీంతో చిన్న వయసులోనే ధృవ్ భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. చోటు సంపాదించుకోవడమే కాకుండా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. మొత్తంగా తండ్రి కొడుకులిద్దరూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 05:10 PM