Share News

Dinesh Karthik: టెస్టుల్లో గిల్ అవసరమా? ఆ ఆటగాడు మంచి ప్రత్యామ్నాయం

ABN , Publish Date - Jan 01 , 2024 | 03:07 PM

Dinesh Karthik: శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అసలు గిల్ అవసరమా అని ప్రశ్నించాడు. మిడిలార్డర్‌లో గిల్ కంటే మంచి ఆటగాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని దినేష్ కార్తీక్ అన్నాడు.

 Dinesh Karthik: టెస్టుల్లో గిల్ అవసరమా? ఆ ఆటగాడు మంచి ప్రత్యామ్నాయం

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వైట్ బాల్ క్రికెట్‌లో రాణిస్తున్న మాదిరిగా రెడ్ ‌బాల్ క్రికెట్‌లో ఆడటం లేదు. ఇప్పటివరకు గిల్ 19 టెస్టులు ఆడగా 31 యావరేజ్‌తో 994 పరుగులు మాత్రమే చేశాడు. అతడి పరుగుల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అసలు గిల్ అవసరమా అని ప్రశ్నించాడు. మిడిలార్డర్‌లో గిల్ కంటే మంచి ఆటగాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని దినేష్ కార్తీక్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియా ఉన్న పరిస్థితుల్లో గిల్ జట్టులో ఉన్నాడంటే అది అతడి అదృష్టం అనే చెప్పాలని అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్ టెస్టులో రాణించకపోతే గిల్ తన స్థానం కోల్పోయే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పాడు.

దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ మిడిలార్డర్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని.. అతడు త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాశం ఉందని దినేష్ కార్తీక్ అన్నాడు. రాజత్ పటీదార్ కూడా మంచి ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యానించాడు. అతడికి కూడా అవకాశాలు రావొచ్చని తెలిపాడు. కాగా సెంచూరియన్ టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన చేయగా.. గిల్ కూడా రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే గిల్ చేశాడు. గత మూడేళ్లుగా టెస్టులు ఆడుతున్నా ఓపెనింగ్ స్థానంలో గిల్ బరిలోకి దిగుతున్నాడు. కానీ గత ఏడాది వెస్టిండీస్ పర్యటనకు సీనియర్లు దూరంగా ఉండటంతో గిల్‌ను వన్‌డౌన్‌లో దింపారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ గిల్‌ను వన్‌డౌన్‌లోనే టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడిస్తోంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 01 , 2024 | 03:07 PM