ICC: స్టార్ ప్లేయర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న గంటల వ్యవధిలోనే..
ABN , Publish Date - Mar 20 , 2024 | 11:56 AM
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్‌ల నిషేధం విధించింది. తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న గంటల వ్యవధిలోనే హసరంగపై వేటు పడడం గమనార్హం.
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్‌ల నిషేధం విధించింది. తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న గంటల వ్యవధిలోనే హసరంగపై వేటు పడడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ పట్ల హసరంగ దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీనిని నేరంగా పరిగణిస్తారు. దీంతో 26 ఏళ్ల హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతోపాటు మూడు డీమెరిట్ పాయింట్లు జారీ చేశారు.
హసరంగ ఖాతాలో ఇంతకుముందే 5 డీమెరిట్ పాయింట్లున్నాయి. దీంతో ప్రస్తుతం హసరంగ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కు చేరుకుంది. దీంతో ఈ నేరం కింద హసరంగపై రెండు టెస్టులు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20లు నిషేధం విధించబడుతుంది. ఇందులో ఏది మొదటగా జరిగితే దానిపై నిషేధం ఎదుర్కొవలసి వస్తుంది. ఈ లెక్కన శ్రీలంక తర్వాత టెస్టులు ఆడనుంది. దీంతో హసరంగపై రెండు టెస్టుల నిషేధం పడింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు హసరంగ దూరమయ్యాడు. ఒకవేళ హసరంగ టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే టీ20లకు దూరం కావాల్సి వచ్చేది. శ్రీలంక తర్వాత తమ టీ20 క్రికెట్‌ను జూన్‌లో జరిగే ప్రపంచకప్‌లోనే ఆడనుంది. దీంతో అప్పుడు శ్రీలంక ఆడే మొదటి 4 మ్యాచ్‌లకు హసరంగ దూరం కావాల్సి వచ్చేది. కాగా హసరంగపై నిషేధం విధించడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో అప్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కూడా పలు తప్పిదాలకు పాల్పడి నిషేధం ఎదుర్కొవలసి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.