IND vs ENG: టీమిండియాకు షాక్.. గాయం కారణంగా జట్టుకు శుభ్‌మన్ గిల్ దూరం
ABN , Publish Date - Feb 05 , 2024 | 10:51 AM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైంది. దీంతో అతను నాలుగో రోజు ఫీల్డింగ్ రాలేదు. ఈ విషయాన్ని నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైంది. దీంతో అతను నాలుగో రోజు ఫీల్డింగ్ రాలేదు. ఈ విషయాన్ని నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ కుడి చేతి వేలికి గాయమైంది. రెండో రోజు ఆటలో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ గాయపడ్డాడు. గాయంతో బాధపడుతూనే మూడో రోజు బ్యాటింగ్ చేసి సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ గిల్ మాత్రం సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం గిల్ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అతడిని పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంచింది. దీంతో నాలుగో రోజు ఆటలో గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ నాటికి గిల్ కోలుకుంటాడా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు కూడా మూడో టెస్టులో ఆడతారా లేదా అనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా 67/1 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహాన్ అహ్మద్‌ను అక్షర్ పటేల్ లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 95 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం ఒలీ పోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన ఓపెనర్ జాక్ క్రాలీ జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. అలాగే తన టెస్ట్ కెరీర్‌లో 12వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ధాటిగా ఆడుతున్న కీలకమైన ఒలీ పోప్(23)ను 29వ ఓవర్‌లో అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 132 పరుగులకు ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 253 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్ అయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.