IND vs ENG: మూడో రోజు ఆటలో నల్ల బ్యాండ్‌లు ధరించిన భారత ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?..
ABN , Publish Date - Feb 17 , 2024 | 08:46 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఇలా ఎందుకు ధరించారో చాలా మందికి అర్థం కాలేదు.
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఇలా ఎందుకు ధరించారో చాలా మందికి అర్థం కాలేదు. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల మరణించిన టీమిండియా అత్యంత వద్ధ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ జ్ఞాపకార్థం మన ఆటగాళ్లంతా నల్ల బ్యాండ్‌లు ధరించి మ్యాచ్ ఆడినట్టు పేర్కొంది. ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది. గుజరాత్‌లోని బరోడాకు చెందిన టీమిండియా అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ ఫిబ్రవరి 13న మరణించిన సంగతి తెలిసిందే. 1928లో జన్మించిన దత్తాజీరావు 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కాగా 2016లో 87 ఏళ్ల వయసులో టీమిండియా మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ మరణించాడు. ఆ తర్వాత భారతదేశపు అత్యంత పురాతన టెస్ట్ క్రికెటర్‌గా దత్తాజీరావు గైక్వాడ్ గుర్తింపు పొందాడు.
అయితే టీమిండియా ఆటగాళ్లు ఆలస్యంగా దత్తాజీరావుకు సంతాపంగా నల్ల బ్యాండులు ధరించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన మొదటి రోజే మన ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి ఉంటే బాగుండేదని అన్నాడు. అలా చేసి ఉంటే ఆయనకు మరింత గౌరవంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగింటికి దత్తాజీరావే సారథిగా వ్యవహరించారని గుర్తు చేశాడు. 1952 నుంచి 1961 మధ్య 9 సంవత్సరాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గైక్వా్డ్ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 4 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1952లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి దత్తాజీరావు గైక్వాడ్ అరంగేట్రం చేశాడు. తన చివరి టెస్టును 1961లో చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో ఆడాడు. తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌లో దత్తాజీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445, ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌట్ అయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 126 పరుగుల ఆధిక్యం లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.