IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా.. తొలి సెషన్‌లోనే బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం
ABN , Publish Date - Jan 25 , 2024 | 12:01 PM
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్‌లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది.
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్‌లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది. నిజానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. ఓపెనర్లిద్దరూ ధాటిగా ఆడడంతో లోకల్ భాయ్ మహ్మద్ సిరాజ్ తన మొదటి స్పెల్‌లో పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. సిరాజ్ వేసిన తొలి రెండు బంతులనే క్రాలే బౌండరీలకు తరలించాడు. బుమ్రా వేసిన మూడో ఓవర్ చివరి రెండు బంతులను డకెట్ బౌండరీలకు తరలించడంతో ఇంగ్లీష్ జట్టు స్కోర్ బోర్డు ఆరంభంలోనే 6 రన్ రేటుతో పరుగులు పెట్టింది. దీంతో ఆలస్యం చేయకుండా 9వ ఓవర్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డులో కాస్త వేగం తగ్గింది. అయినప్పటికీ ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే ఈ భాగస్వామ్యాన్ని 12వ ఓవర్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. ధాటిగా ఆడుతున్న బెన్ డకెట్(35)ను లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో 55 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే ఓల్లీ పోప్(1)ను జడేజా, జాక్ క్రాలే(20)ను అశ్విన్ పెవిలియన్ చేర్చారు. దీంతో 5 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో తమ బజ్‌బాల్ వ్యూహంతో వేగంగా ఆడి పరుగులు సాధించాలనే ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. 15.1 ఓవర్లలో 60 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్, జానీ బెయిర్‌స్టో కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. బెయిర్‌స్టో ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ మన స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఆ తర్వాత కాస్త నిదానంగా బ్యాటింగ్ చేశాడు. రూట్, బెయిర్‌స్టో కలిసి ఇంగ్లండ్ స్కోర్‌ను తొలి సెషన్‌లో 100 పరుగులు దాటించారు. 28 ఓవర్లపాటు సాగిన మొదటి సెషన్‌లో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజులో రూట్(18), బెయిర్ స్టో(32) ఉన్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ జోడి కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు వీరిద్దరు కలిసి 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలింగ్ జోడిగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. అలాగే 501 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే- హర్బజన్ సింగ్ రికార్డును బద్దలుకొట్టారు. దీంతో ప్రస్తుతం 503 వికెట్లతో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడిగా అశ్విన్- జడేజా చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో బెన్ డకెట్, ఓల్లీ పోప్, జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ - జడేజా జోడి ఈ రికార్డు నెలకొల్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.