Share News

IND vs ENG: అతని విషయంలో కాస్త ఓపికతో ఉండండి.. మూడో టెస్టుకు ముందు మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:09 PM

ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు టెస్టుల్లో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. వికెట్ కీపర్‌గా సత్తా చాటినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం చేత్తులెత్తేశాడు. తన సొంత మైదానం వైజాగ్‌లోనూ బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు.

IND vs ENG: అతని విషయంలో కాస్త ఓపికతో ఉండండి.. మూడో టెస్టుకు ముందు మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు టెస్టుల్లో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. వికెట్ కీపర్‌గా సత్తా చాటినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం చేత్తులెత్తేశాడు. తన సొంత మైదానం వైజాగ్‌లోనూ బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మూడో టెస్టులో కేఎస్ భరత్‌పై వేటు పడనుందనే వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో యువ ఆటగాడు ధృవ్ జురేల్ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మద్దతుగా నిలిచాడు. కేఎస్ భరత్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ కాస్త ఓపికతో ఉండాలని సూచించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యం ఆధారంగానే కేఎస్ భరత్‌ను అంచనా వేయాలని అంటున్నాడు. 2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి టీమిండియా టెస్టు జట్టులో వికెట్ కీపర్ల సమస్యలు వెంటాడుతున్నాయని అన్నాడు.


ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ‘‘రాజ్‌కోట్ టెస్టు ద్వారా ధృవ్ జురేల్ అరంగేట్రం చేయొవచ్చనే వార్తలను నేను వింటున్నాను. ఈ నిర్ణయం సరైనదా? తప్పా? అని నేను ఆలోచిస్తున్నాను. మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగితే వికెట్ కీపింగ్ నైపుణ్యం ఆధారంగా కేఎస్ భరత్‌ను ఎంచుకోవాలని చెబుతాను. నాకు అతను చెడుగా ఏమీ కనిపించలేదు. అతను మంచి పని చేస్తున్నాడు. ఇవి కష్టమైన పిచ్‌లు. అందుకే మీరు(టీమ్ మేనేజ్‌మెంట్) కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా తీసుకోబోమని చెప్పారు. స్పెషలిస్ట్ కీపర్ కావాలని అన్నారు. కాబట్టి ఆ స్పెషలిస్ట్ కీపర్ పాత్రలో అతను(భరత్) తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో బాగానే ఆడాడు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది. అది కొంచెం నిరాశను కల్గించి ఉంటుంది. మూడో టెస్టు మ్యాచ్‌లో భరత్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. మీరు కీపర్‌ను కీపర్‌గా చూడాలి. జడేజా తిరిగి వస్తే మీకు ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. వారు ముగ్గురు బ్యాటర్లు కూడా.

కేఎస్ భరత్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ త్వరగా విశ్వాసం కోల్పోతే నేను కొంచెం నిరాశ చెందుతాను. గతంలో ఇదే జరిగింది. కేఎస్ భరత్ ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్ ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌కు పర్యటనకు వెళ్లింది. అక్కడ వికెట్ కీపర్‌ను మార్చారు. ఇషాన్ కిషన్‌ను ఆడించారు. రిషబ్ పంత్ గాయపడినప్పటి నుంచి వికెట్ కీపర్ల విషయంలో కంటిన్యూటీ కొరవడింది. కాబట్టి భరత్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ కొంచెం ఓపికతో ఉండాలని నేను భావిస్తున్నాను. కేఎస్ భరత్‌ను కనీసం ఇంకొక టెస్టు అయినా ఆడించాలి. నేను అయితే అతను మొత్తం 5 టెస్టులు ఆడాలని కోరుకుంటున్నాను. బ్యాటింగ్ ముఖ్యం అయితే కనీసం ఇంకొక మ్యాచ్ అవకాశం అయినా ఇవ్వండి. ’’ అని అన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో కేఎస్ భరత్ విఫలమయ్యాడు. తొలి టెస్టులో 41, 28.. రెండో టెస్టులో 17, 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మూడో టెస్టు మ్యాచ్‌లో భరత్‌కు చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 12:09 PM