IND vs ENG: చివరి టెస్టులో గెలిస్తే 112 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాయనున్న భారత్
ABN , Publish Date - Feb 28 , 2024 | 06:47 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు దుమ్మలేపుతోంది. వరుసగా 3 టెస్టులు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడినప్పటకీ ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. గాయాలు, ఇతర కారణాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ రోహిత్ శర్మ సారథ్యంలోని యువ జట్టు అదరగొట్టింది.
ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు దుమ్ములేపుతోంది. వరుసగా 3 టెస్టులు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడినప్పటకీ ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. గాయాలు, ఇతర కారణాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ రోహిత్ శర్మ సారథ్యంలోని యువ జట్టు అదరగొట్టింది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 112 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును నెలకొల్పనుంది. గత 112 ఏళ్లలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడినప్పటికీ ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ చరిత్ర తిరగరాయనుంది.
కాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న మూడో జట్టుగా టీమిండియా నిలవనుంది. మొత్తంగా ఇలా జరగడం నాలుగో సారి మాత్రమే అవుతుంది. గతంలో మూడు సార్లు మాత్రమే ఇలా జరిగింది. అందులో రెండుసార్లు ఆస్ట్రేలియానే చేసింది. 1897/98, 1901/02లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆ తర్వాత సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. 1911/12 ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ కూడా అచ్చం ఇలాగే సిరీస్ గెలిచింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా అనూహ్యంగా మ్యాచ్ ఓడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వెంటనే పుంజుకున్న భారత్ విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో గెలిచింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.