IND vs ENG: వైజాగ్ టెస్టుకు భారత తుది జట్టులో కీలక మార్పులు.. రాహుల్, జడేజా స్థానాల్లో ఆడేది ఎవరంటే..
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:41 PM
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
వైజాగ్: హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే వైజాగ్ టెస్టుకు తుది జట్టు ఎంపిక టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరం కాగా.. మొదటి టెస్టులో రాణించిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. దీంతో వీరిద్దరి స్థానాల్లో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గాయంతో జట్టుకు దూరమైన జడేజా, రాహుల్ స్థానాల్లో ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి ముగ్గురిలో కనీసం ఒకరైన తుది జట్టులో ఉండడం ఖాయమనే చెప్పుకోవాలి. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఫేలవ ప్రదర్శన టీమిండియాను కంగారు పెడుతోంది. హైదరాబాద్ టెస్టులో ఎదురైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వైజాగ్‌లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుందా లేదా నలుగురు స్పిన్నర్లతో ఆడుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కొనసాగనున్నారు. మూడో స్థానంలో ఆడుతున్న శుభ్‌మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. కానీ అతనికి మరో అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మూడో స్థానంలో గిల్ ఆడనున్నాడు. రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో నాలుగో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పటీదార్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీంతో వైజాగ్ టెస్టు ద్వారా వీరిద్దరిలో ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. అయితే ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది టీమ్ మేనేజ్‌మెంటుకు సవాల్‌గా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వీరి గత రికార్డులు, ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నారు. అయితే అదనంగా మరో స్పెషలిస్ట్ బ్యాటర్ కావాలనుకుంటే తుది జట్టులో ఇద్దరికీ చోటు దక్కే అవకాశాలున్నాయి. ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్న అయ్యర్ ఈ మ్యాచ్‌లో బ్యాటు ఘుళింపిచాల్సిన అవసరం ఉంది. వికెట్ కీపర్‌గా కేఎస్ భర్త కొనసాగనున్నాడు.
స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కొనసాగనున్నారు. జడేజా దూరం కావడంతో మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నవారిని తీసుకోవాలనుకుంటే కుల్దీప్‌నకు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సుందర్, కుల్దీప్ ఇద్దరు తుది జట్టులో ఉంటారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కొనసాగనున్నారు. అయితే ఒక వేళ ఒకే పేసర్‌తో ఆడాలని భావిస్తే సిరాజ్‌పై వేటు పడనుంది. కానీ అప్పుడు బుమ్రాపై అధిక భారం పడనుంది. అయితే హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి విజయవంతమైన సంగతి తెలిసిందే. దీంతో వైజాగ్ టెస్టులో పరిస్థితులను బట్టి టీమిండియా కూడా నలుగురు స్పిన్నర్లతో ఆడాలని పలువురు క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే పిచ్‌ను పరిశీలించాక భారత జట్టు ఎలాంటి తుది జట్టుతో ఆడనుందో చూడాలి.
టీమిండియా తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.