Share News

IND vs ENG: చరిత్ర సృష్టించిన ధృవ్ జురేల్.. గత 22 ఏళ్లలో..

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:01 PM

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

IND vs ENG: చరిత్ర సృష్టించిన ధృవ్ జురేల్.. గత 22 ఏళ్లలో..

రాంచీ: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో స్వదేశంలో వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. 192 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 120 పరుగులకే సగం వికెట్లు నేలకూలాయి. ఇలాంటి సమయంలో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్, ధృవ్ జురేల్ 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. 52 పరుగులు చేసిన గిల్, 39 పరుగులు చేసిన ధృవ్ నాటౌట్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధృవ్ జురేల్ 90 పరుగులతో చెలరేగాడు. దీంతో ధృవ్ జురేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


ఈ క్రమంలోనే వికెట్ కీపర్, బ్యాటర్ అయిన ధ‌ృవ్ జురేల్ చరిత్ర సృష్టించాడు. గత 22 ఏళ్లలో అరంగేట్ర టెస్ట్ సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా ఇదే ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ ద్వారానే ధృవ్ జురేల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 23 ఏళ్ల ధృవ్ జురేల్ 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ ధృవ్ ఆకట్టుకుంటున్నాడు. దీంతో వికెట్ కీపర్‌గా టీమిండియాలో జురేల్‌కు సుస్థిర స్థానం ఖరారు అయిందనే చెప్పుకోవాలి. రోడ్డు ప్రమాదం కారణంగా రిషబ్ పంత్, మానసిక సమస్యలతో ఇషాన్ కిషన్ జట్టుకు దూరం కావడం, కేఎస్ భరత్ బ్యాటింగ్‌లో పరుగులు చేయలేక పోతుండడంతో టీమిండియాలో ధృవ్‌కు చోటు కల్పించారు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసిపట్టుకున్న ధృవ్ సత్తా చాటుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 06:02 PM