Share News

IND vs ENG: సెంచరీతో చెలరేగిన జోరూట్.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

ABN , Publish Date - Feb 23 , 2024 | 05:25 PM

సీనియర్ బ్యాటర్ జోరూట్ అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒకానొక దశలో 57 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్ ఆదుకున్నాడు.

IND vs ENG: సెంచరీతో చెలరేగిన జోరూట్.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

రాంచీ: సీనియర్ బ్యాటర్ జోరూట్ అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒకానొక దశలో 57 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్ ఆదుకున్నాడు. ఆ తర్వాత కూడా మొదటి సెషన్‌లోనే 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మిడిలార్డర్ బ్యాటర్లతో మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన రూట్ తొలి రోజు ఇంగ్లండ్‌ను ఆలౌట్ కాకుండా రక్షించాడు. రూట్‌కు బెన్ ఫోక్స్(47), జానీ బెయిర్‌స్టో(38) సహకరించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్(106), ఒల్లీ రాబిన్సన్ (31) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జడేజా, అశ్విన్ తలో వికెట్ తీశారు. మొదటి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారనే చెప్పుకోవాలి.


టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ టాపార్డర్‌ను తొలి సెషన్‌లోనే టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ వణికించాడు. వెంటవెంటనే 3 వికెట్లు తీయడంతో 57 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌లో బెన్ డకెట్(11), ఒల్లీ పోప్(0)ను పెవిలియన్ చేర్చిన ఆకాష్ దీప్.. 12వ ఓవర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలే(42)ను ఔట్ చేశాడు. ఈ సమయంలో రూట్, బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ స్కోర్ 100 దాటింది. అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్‌స్టోను(38)ను 22వ ఓవర్‌లో అశ్విన్ లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. దీంతో తొలి సెషన్‌లోనే 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

ఇలాంటి సమయంలో రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ను వెటరన్ బ్యాటర్ జోరూట్, బెన్ ఫోక్స్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ పాలిట రూట్ ఆపద్బాంధవుడి అవతారం ఎత్తాడు. ఇంగ్లండ్ బాజ్‌బాల్ వ్యూహానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన వీరిద్దరు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. దీంతో రెండో సెషన్‌లో భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ ఒక వికెట్ కూడా సాధించలేకపోయారు. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. రూట్, ఫోక్స్ కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీబ్రేక్ అనంతరం మొదలైన మూడో సెషన్ ఆరంభంలోనే హాఫ్ సెంచరీని చేరువ అవుతున్న ఫోక్స్(47)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో రూట్, ఫోక్స్ భాగస్వామ్యాన్ని తెరపడింది. 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన సిరాజ్ టామ్ హార్ట్‌లీ(13)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 245 పరుగులకు ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఓల్లీ రాబిన్సన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు రూట్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో రూట్ తన టెస్టు కెరీర్‌లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆకాష్ దీప్ వేసిన 84వ ఓవర్‌లో బౌండరీ కొట్టి సెంచరీ మార్కు అందుకున్నాడు. 9 ఫోర్లతో 219 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్కోర్ కూడా 300 దాటింది. తొలి సెషన్‌లోనే 5 వికెట్లు తీసిన మన బౌలర్లు మిగతా 2 సెషన్లలో కలిసి 2 వికెట్లు మాత్రమే తీశారు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 05:31 PM