Share News

IND vs ENG: 399 రన్స్ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోగలదా?.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

ABN , Publish Date - Feb 05 , 2024 | 09:12 AM

Vizag test: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 332 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి.

IND vs ENG: 399 రన్స్ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోగలదా?.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

వైజాగ్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 332 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. దీంతో నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. నిజానికి టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే. ఇక భారత్ వంటి పిచ్‌లపై 250+ లక్ష్యాన్ని చేధించడం కూడా అంత సులువు కాదు. అలాంటిది 399 పరుగుల లక్ష్యం అంటే చేధించడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గతంలో భారత్‌లో ఏ జట్టు కూడా 300+ పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. అయితే వీటన్నింటిని బట్టి చూసి టీమిండియా గెలుపు ఖరారు అయిపోయినట్టే అనుకోవడానికి వీల్లేదు.


ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ వ్యూహంతో అద్భుతాలు చేస్తోంది. సాధ్యం కాదనుకున్న భారీ లక్ష్యాలను సైతం సునాయసంగా చేధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహానికి 2022లో భారత జట్టు బలైపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో అతిథ్య జట్టు ముందు టీమిండియా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో టీమిండియా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో బజ్‌బాల్ వ్యూహంతో భారత బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లండ్ 76.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అద్భుత అవకాశం టీమిండియాకు చేజారింది. దీంతో ఇంగ్లండ్‌ను అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదని క్రికెట్ విశ్లేషకులు టీమిండియాను హెచ్చరిస్తున్నారు. భారత్‌లో గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. టెస్టుల్లో 300+ లక్ష్య చేధన రెండు సార్లు మాత్రమే విజయవంతంగా సాధ్యమైంది. అది కూడా టీమిండియానే చేసింది. 2008లో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 387 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి గెలిచింది. 1977లో ఆస్ట్రేలియాపై టీమిండియా 339 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇక పర్యాటక జట్టు ఏది కూడా ఇండియాలో 300+ లక్ష్యాన్ని చేధించలేదు. 1987లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో వెస్టిండీస్ జట్టు 276 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలిచింది. భారత్ వేదికగా టెస్టుల్లో ఓ పర్యాటక జట్టు చేధించిన అత్యధిక స్కోర్ ఇదే.

ఇక భారత్‌లో ఇంగ్లండ్ అత్యతధిక విజయవంతమైన చేధన 207గా ఉంది. 1972లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయంతంగా 207 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఆసియా మొత్తంలో ఇంగ్లండ్ చేధించిన అత్యధికంగా లక్ష్య చేధన 209గా ఉంది. 1961 వేదికగా లాహోర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై, 2009లో మిర్పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని చేధించింది. ఆసియా మొత్తంలో అత్యధిక లక్ష్య చేధన 395గా ఉంది. 2021లో చటోగ్రామ్ వేదికగా జరిగిన టెస్టులో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. దీనిని బట్టి చూస్తే వైజాగ్ టెస్టులో 399 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఇంగ్లండ్ గెలవడం అంత సులువు కాదు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే అది చరిత్రే అవుతుంది. కాగా వైజాగ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396, ఇంగ్లండ్ 253 పరుగులు చేశాయి. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 09:12 AM