IND vs ENG: విశాఖ వేదికగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్.. 2011 నుంచి..
ABN , Publish Date - Feb 03 , 2024 | 02:22 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపాడు. రెండో రోజు ఆటలో ఏకంగా డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.
విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపాడు. రెండో రోజు ఆటలో ఏకంగా డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు. మిగతా భారత బ్యాటర్లంతా విఫలమైన చోట జైస్వాల్ మాత్రమే సునాయసంగా పరుగుల వరద పారించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 396 పరుగులు చేసింది. అయితే జైస్వాల్ చేసిన 209 పరుగుల్లో తొలి రోజే 179 పరుగులు బాదేశాడు. దీంతో తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 2011 నుంచి తొలి రోజు ఆటలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2021లో ఇదే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో 161 పరుగులు చేసిన రోహిత్ శర్మను జైస్వాల్ అధిగమించాడు. 2017లో 156 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2017లో 155 పరుగులు చేసిన మురళీ విజయ్ ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
కాగా యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో జైస్వాల్ 209, శుభ్‌మన్ గిల్ 34, రజత్ పటీదార్ 32, శ్రేయాస్ అయ్యర్ 27, అక్షర్ పటేల్ 27, అశ్విన్ 20, భరత్ 17, రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బషీర్, రెహన్ అహ్మద్ మూడేసి వికెట్లు తీశారు. టామ్ హార్ట్‌లీ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 75 పరుగులుచేసింది. క్రీజులో జాక్ క్రాలే(52), ఒలీ పోప్ (2) ఉన్నారు. బెన్ డకెట్(21)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయంది.