CSK vs GT: చెలరేగిన దూబే, రచీన్ రవీంద్ర.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
ABN , Publish Date - Mar 26 , 2024 | 09:44 PM
యువ బ్యాటర్లు చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే(51), రచీన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్ (46) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు.
చెన్నై: యువ బ్యాటర్లు చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే(51), రచీన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్ (46) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. చెన్నై బ్యాటర్ల ధాటికి గుజరాత్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రచీన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రచీన్ రవీంద్ర చెన్నై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఉమేష్ యాదవ్ వేసిన 4వ ఓవర్‌లో రచీన్ రవీంద్ర ఓ ఫోర్, సిక్సు, రుతురాజ్ గైక్వాడ్ ఓ ఫోర్ బాదడంతో 16 పరుగులొచ్చాయి. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఐదో ఓవర్‌లో రచీన్ రవీంద్ర ఓ సిక్సు, ఫోర్, రుతురాజ్ ఫోర్ బాదడంతో 17 పరుగులొచ్చాయి. అయితే ఈ భాగస్వామ్యాన్ని ఆరో ఓవర్‌లో స్పిన్నర్ రషీద్ ఖాన్ విడదీశాడు. దూకుడుగా ఆడుతున్న రచీన్ రవీంద్ర స్టంపౌట్ అయ్యాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 20 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు.
అనంతరం అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ కలిసి రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో చెన్నై స్కోర్ 100 పరుగులు దాటింది. 11వ ఓవర్‌లో రహానే(12)ను మరో స్పిన్నర్ సాయి కిషోర్ పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న రుతురాజ్ గైక్వాడ్‌ను పేసర్ స్పెన్సర్ జాన్సన్ ఔట్ చేశాడు. దీంతో 127 పరుగులకు చెన్నై 3 వికెట్లు కోల్పోయింది. 36 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 5 ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేశాడు. అనంతరం డారిల్ మిచెల్‌తో కలిసి శివమ్ దూబే రెచ్చిపోయాడు. 2 ఫోర్లు, 5 సిక్సులతో 23 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబే.. రషీద్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 35 బంతుల్లోనే 57 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. ఆ ఓవర్ దూబే వికెట్ దొరికినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీ 2 సిక్సులు బాదడంతో 15 పరుగులొచ్చాయి. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై స్కోర్ కూడా 200 దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చివరి బంతికి మిచెల్(24) రనౌట్ అయ్యాడు. రిజ్వి 14, జడేజా 7 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సాయి కిషోర్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.