IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌లో బిగ్ ప్లేయర్ ఆడడం డౌటే!
ABN , Publish Date - Mar 18 , 2024 | 07:19 PM
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఇప్పటికే గాయాల కారణంగా ఆ జట్టు యువ పేస్ బౌలర్లు దిల్షాన్ మధుశంక, గెరాల్డ్ కోయేట్జీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం అయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఈ నెల 24న గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది. దీంతో జట్టులోని ఆటగాళ్లంతా ఇప్పటికే టీం క్యాంపులో చేరారు. రోహిత్ శర్మ కూడా సోమవారం ముంబై క్యాంపులో చేరాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇప్పటివరకు ముంబై క్యాంపులో చేరాడు. దీంతో సూర్య తొలి మ్యాచ్‌లో ఆడడం అనుమానమే అని ఓ జాతీయ మీడియా పేర్కొంది.
సౌతాఫ్రికా పర్యటన అనంతరం గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2024 జనవరిలో జర్మనీలో సూర్యకుమార్ యాదవ్‌కు శస్త్ర చికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం సూర్య బీసీసీఐ ఆధ్వర్యంలో ఉన్నాడు. ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. అయితే సూర్య గాయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఐపీఎల్ బరిలోకి అతను ఎప్పుడు దిగుతాడననే దానిపై స్పష్టత లేదు. ఇదే అంశంపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ ఫిట్ నెస్‌కు సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. బీసీసీఐ నుంచి సమాచారం రావాల్సి ఉంది అని, ఎలాంటి ఫిట్‌నెస్ సమస్య ఉన్నా పరిష్కరాస్తామని పేర్కొన్నాడు. తమ వద్ద ప్రపంచస్థాయి వైద్య బృందం అందుబాటులో ఉందని బౌచర్ తెలిపాడు. కాగా ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ గత సీజన్‌లో అదరగొట్టాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 43 సగటుతో 605 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.