Share News

Ranji Trophy: ఫైనల్ చేరిన ముంబై.. రికార్డు స్థాయిలో ఎన్నిసార్లంటే..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 05:41 PM

దేశవాళీ క్రికెట్ లీగ్ రంజీ ట్రోఫీలో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా 47 సార్లు ఫైనల్ చేరిన ముంబై జట్టు తాజాగా ఈ సీజన్‌లోనూ తుదిపోరులో అడుగుపెట్టింది. దీంతో ముంబై జట్టు 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరింది.

Ranji Trophy: ఫైనల్ చేరిన ముంబై.. రికార్డు స్థాయిలో ఎన్నిసార్లంటే..?

ముంబై: దేశవాళీ క్రికెట్ లీగ్ రంజీ ట్రోఫీలో (Ranji Trophy) ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా 47 సార్లు ఫైనల్ చేరిన ముంబై జట్టు తాజాగా ఈ సీజన్‌లోనూ తుదిపోరులో అడుగుపెట్టింది. దీంతో ముంబై జట్టు 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరింది. మిగతా టీంలకు సాధ్యం కానీ విధంగా ముంబై జట్టు ఏకంగా 41 సార్లు రంజీ ట్రోఫి గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై జట్టు అదరగొట్టింది. సెమీస్ పోరులో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ముంబై జట్టు కూడా తమిళనాడు బౌలర్ల ధాటికి ఒకానొక దశలో 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.


ఇలాంటి సమయంలో ఆ జట్టు 9వ నంబర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్, హార్దిక్ తమోర్(35) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు 8వ వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అనంతరం హార్దిక్ తమోర్ ఔట్ అయినప్పటికీ తనుష్ కోటియన్‌తో కలిసి శార్దూల్ ఠాకూర్ 9వ వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డే తరహా బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శార్దూల్‌కు ఇదే మొదటి సెంచరీ. 13 ఫోర్లు, 4 సిక్సులతో 105 బంతుల్లో 109 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో 290 పరుగులకు ముంబై 9 వికెట్లు కోల్పోయింది. చివరి బ్యాటర్ తుషార్ దేశ్‌పాండేతో కలిసి 10 వికెట్‌కు తనుష్ కోటియన్ 88 పరుగులు జోడించాడు. అనంతరం తుషార్ దేశ్ పాండే(26) ఔట్ కావడంతో 378 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 89 పరుగులు చేసిన తనుష్ కోటియన్ నాటౌట్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ సాయి కిషోర్ 6 వికెట్లు తీశాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తమిళనాడు బ్యాటర్లు తేలిపోయారు. 232 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 162 పరుగులకే కుప్పకూలారు. దీంతో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో గెలిచింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మర్నిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 05:41 PM