Share News

IPL 2024: కోహ్లీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ గెలిచేది అతనే: చాహల్

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:01 PM

ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22 నుంచే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆడే చివరి మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడే ఐదో టెస్టే. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఐపీఎల్ మూడ్ వచ్చేసింది.

IPL 2024: కోహ్లీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ గెలిచేది అతనే: చాహల్

ఐపీఎల్ 2024 (IPL 2024) ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22 నుంచే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆడే చివరి మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడే ఐదో టెస్టే. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఐపీఎల్ మూడ్ వచ్చేసింది. ఈ సారి ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుంది? అత్యధిక రన్స్, అత్యధిక వికెట్లు తీసే బౌలర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా సీనియర్ బౌలర్, లెగ్ స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) దీనిపై మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో సదరు యూట్యూబర్ చాహల్‌ను పలు ప్రశ్నలు అడిగాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకునే ప్లేయర్లు ఎవరో అంచనా వేయమని అడిగాడు.


దీనికి చాహల్ బదులిస్తూ టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ లేదా ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటారని అభిప్రాయపడ్డాడు. టీమిండియా సీనియర్ బ్యాటర్లు, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లుగా పేరు ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చాహల్ ఎంచుకోక పోవడం గమనార్హం. ఇక పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుచుకుంటానని చాహల్ ధీమా వ్యక్తం చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తన తర్వాత గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిలుస్తాడని చెప్పాడు. కాగా చాహల్‌తోపాటు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన చాహల్ గత రెండేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు ప్రస్తుతం చాహల్ పేరు మీదనే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 145 మ్యాచ్‌లాడిన చాహల్ 187 వికెట్లు తీశాడు. కాగా కొన్ని రోజులుగా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్.. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల్లోనూ చోటు కోల్పోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 04:06 PM