Share News

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:03 PM

Boxing Day Test: తెలుగోడి దమ్మేంటో మరోమారు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. మనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని ప్రూవ్ చేశాడు. మ్యాచ్ తమదే అని ధీమాతో ఉన్న కంగారూలకు ఒక రేంజ్‌లో పోయించాడు.

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ
Nitish Kumar Reddy

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్.. 150 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న స్టేడియం. ఆస్ట్రేలియాలో అత్యంత జనాదరణ గల మైదానం. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది కంగారూ ప్లేయర్లతో పాటు ఎందరో ఇతర దేశ ఆటగాళ్ల కల. ఇక్కడ పది పరుగులు కొట్టినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాకలుదీరిన ఆసీస్ బౌలర్లను తట్టుకొని ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత సులువు కాదు. రాకాసి బౌన్సర్లు, మెలికలు తిరుగుతూ వచ్చే స్వింగర్లు, నిప్పలు చెరిగే యార్కర్లకు తోపు బ్యాటర్లు కూడా భయపడతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్లు కూడా కంగారూల ధాటిని తట్టుకోలేక చేతులెత్తేశారు. కానీ ఆ ఒక్కడు నిలబడ్డాడు. పట్టుదలతో ఆడుతూ ఆస్ట్రేలియా బెండు తీశాడు. తెలుగోడి పొగరు ఏంటో చూపించాడు. సెంచరీ బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. అతడే తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.


రియల్ ఫైటర్

వయసు 21. ఆడుతోంది కెరీర్‌లో నాలుగో టెస్టే. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదు. రోహిత్, విరాట్ సహా సీనియర్లంతా పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో కుర్రాడు వాషింగ్టన్ సుందర్ అవతలి ఎండ్‌లో ఉన్నాడు. అతడూ టీమ్‌లో పర్మినెంట్ బెర్త్ కోసం పోరాడుతున్న ప్లేయరే. ఎదురుగా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్, నాథన్ లియాన్ లాంటి స్టార్ బౌలర్లు. చిన్న తప్పు చేసినా ఔట్ అవడం ఖాయం. ఫాలో ఆన్ గండంతో టీమ్ కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి స్టన్నింగ్ బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 176 బంతుల్లో 10 బౌండరీలు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సుందర్ (50) సాయంతో జట్టును ఆదుకున్నాడు. ఫాలో ఆన్ భయంలో ఉన్న జట్టును ఇప్పుడు పోరాడితే విజయం తథ్యం అనే స్థాయికి తీసుకొచ్చాడు.


ప్రభాస్-బన్నీ స్టైల్‌లో..

కమిన్స్-స్టార్క్ ద్వయంతో పాటు స్పిన్నర్ లియాన్‌ను పిచ్చ కొట్టుడు కొట్టాడు నితీష్. ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న బ్యాటర్‌లా ఆడాడు. అడ్డగోలు షాట్లకు పోకుండా మొదట క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి గురి కుదిరాక.. బాల్ మెరిట్‌ను బట్టి షాట్లు ఆడుతూ పోయాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోకుండా చెత్త బాల్ పడితే శిక్షించాడు. ఓటమి అంచున ఉన్న జట్టును కాపాడి.. గెలుపుపై అంచనాలు పెంచాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక ‘పుష్ప’ మూవీలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్‌‌‌లో బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో గడ్డాన్ని సవరించాడు. మూడంకెల మార్క్‌ను అందుకోగానే ‘బాహుబలి’, ‘సలార్’లో ప్రభాస్ మాదిరిగా బ్యాట్‌ను నేలకు ఆనించి.. పైకి చూసి దేవుడ్ని తలచుకున్నాడు. అతడి బ్యాటింగ్, టాలీవుడ్‌ పొగరు చూపిస్తూ చేసిన సెలబ్రేషన్స్, స్వాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదీ తెలుగోడి దెబ్బ అని నితీష్ సెలబ్రేషన్, ఇన్నింగ్స్‌ను చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్

బాష్‌ ప్రపంచ రికార్డు

అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. పుష్ప స్టైల్లో సంబరాలు

సెమీస్‌కు లక్ష్యసేన్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 03:14 PM