Nitish Kumar Reddy: ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్
ABN , Publish Date - Dec 06 , 2024 | 02:50 PM
Nitish Kumar Reddy: తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. అడిలైడ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చావుదెబ్బ తీశాడు. హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్‌ను నితీష్ గుర్తుచేశాడు.
IND vs AUS: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జట్టుగా ఆస్ట్రేలియాను చెబుతుంటారు. కంగారూలతో మ్యాచ్ అంటే టాప్ టీమ్స్ కూడా భయపడతాయి. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగే ఆసీస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవాలంటే తోపు బ్యాటర్లు కూడా వణుకుతారు. అయితే తెలుగు వాళ్లు మాత్రం దీనికి మినహాయింపు అనే చెప్పాలి. అజహరుద్దీన్ నుంచి వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ వరకు కంగారూ బౌలర్లతో ఆడుకోవడంలో ఇక్కడి వారికి ఘనచరిత్రే ఉంది. దీన్ని రిపీట్ చేస్తున్నాడు మరో తెలుగు కుర్రాడు. అతడే యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. బీజీటీలో ఆసీస్ బౌలర్ల తోలు తీస్తున్నాడతను. వరుసగా సూపర్బ్ నాక్స్‌తో వారిని హడలెత్తిస్తున్నాడు.
అస్త్రాలు బయటకు తీసి..
పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను వణికించిన నితీష్ రెడ్డి.. అడిలైడ్ టెస్ట్‌లోనూ అదే రిపీట్ చేశాడు. భారీ షాట్లతో ఆ జట్టు బౌలర్లకు పోయించాడు. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా.. నితీష్ మాత్రం పట్టుదలో ఆడాడు. బంతి అనూహ్యమైన బౌన్స్, స్వింగ్ అవుతూ.. భీకర వేగంతో దూసుకొస్తున్నా అతడు మాత్రం భయపడలేదు. తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీశాడు. క్లాసిక్ షాట్స్‌తో కమిన్స్, స్టార్క్, బోలాండ్‌కు వణుకు పుట్టించాడు. కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్‌తో పాటు రివర్స్ స్వీప్, స్కూప్ షాట్స్ లాంటివి ఆడుతూ వారిని భయపెట్టాడు.
కౌంటర్ అటాక్
పింక్ బాల్ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఒక దశలో 109 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ (54 బంతుల్లో 42) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుస వికెట్లు తీస్తూ జోరు మీద ఉన్న స్టార్క్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిన నితీష్.. బిగ్ షాట్స్‌తో విరుచుకుపడ్డాడు. కమిన్స్ బౌలింగ్‌లో అతడు కొట్టిన కవర్‌డ్రైవ్ హైలైట్‌గా నిలిచింది. స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ కొట్టిన సిక్స్, బోలాండ్ బౌలింగ్‌లో కొట్టిన స్కూప్ షాట్ కంగారూలకు నిద్రపట్టకుండా చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. నితీష్ హిట్టింగ్ వల్లే భారత్ కనీసం 180 పరుగులైనా చేయగలిగింది. అతడి బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడావంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Also Read:
జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..
ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..
కేఎల్ రాహుల్ చేసిన పనికి.. క్షణాల్లో ఆవిరైన ఆస్ట్రేలియా ఆనందం.. వీడియో
భారీ ఎదురుదెబ్బ.. కీలక వికెట్ సమర్పించుకున్న టీమిండియా
For More Sports And Telugu News